Free Electricity: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అధికారం చేపట్టిన రెండో రోజే రెండు గ్యాంరటీలను అమలు చేసింది. ఆరోగ్యశ్రీ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. తాజాగా మరో రెండు పథకాలు ప్రారంభించింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్లు మార్చి 1 నుంచి అందించాలని నిర్ణయించింది.
నేటి నుంచే అమలు..
ఫిబ్రవరి 27న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు గ్యాంరటీను చేవెళ్లలో ప్రారంభించారు. దీంతో శుక్రవారం(మార్చి 1) నుంచి జీరో కరెంటు బిల్లు అమలులోకి వచ్చింది. ఈమేరకు బిల్ కలెక్టర్లు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేయనున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని రేషన్‌కార్డు ఉన్నవారు మీటర్‌తో అనుసంధానం చేసుకుంటే 200 యూనిట్ల విద్యుత్‌కు జీవో బిల్ జారీ చేయనున్నారు.
కొందరికే ప్రయోజనం..
ఇటీవల సచివాలయంలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి గృహజ్యోతితోపాటు రూ.500లకే సిలిండర్ పథకాలను ప్రారంభించారు. అయితే ఈ ప్రయోజనాలు అందరికీ అందవని తెలుస్తోంది. నిబంధనల కారణంగా అర్హులు చాలా మంది లబ్ధి పొందలేరని ప్రచారం జరుగుతోంది. మొదట అందరికీ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు రేషన్‌కార్డు తప్పనిసరి చేసింది. దీంతో రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందదు. ఇక ఇంటికి ఒక మీటర్ నిబంధన పెట్టారు. దీంతో యజమానికి సబ్సిడీ వస్తే అద్దెకు ఉంటున్నవారికి రాదు. ఏడాది సగటు ఆధారంగా ఉచిత యూనిట్లు ఇస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. అంతకన్నా ఎక్కువ వినియోగిస్తే బిల్లు కట్టాల్సిందే. ఇక గ్యాస్ కూడా మహిళల పేరిట కనెక్షన్ ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో 75 శాతం మంది అర్హత కోల్పోయే అవకాశం ఉంది.