Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికలకు జనసేన సిద్ధపడుతోంది. అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరు నుంచి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమవుతుంది. దాదాపు 80 రోజులు పాటు ప్రజల మధ్య పవన్ ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్ కదుపుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టమన్నారు. విశాఖ తో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
ప్రతిరోజు మూడు సభలకు పవన్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నాయి. దీనిపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతలను జోనల్ కమిటీలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి 191 మందితో కమిటీలు వేసినట్లు తెలిపారు. నెలాఖరులోగా పవన్ పర్యటనల షెడ్యూల్ ఖరారు అవుతుందని వివరించారు.
తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు బిజెపి కూటమిలోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రాథమికంగా సీట్ల సర్దుబాటు విషయం కొలిక్కి వచ్చిందని.. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే వరకు బయట పెట్టరని తెలుస్తోంది. ఇంతలో తెలుగుదేశం పార్టీతో ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో పవన్ ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. ఉమ్మడి పార్టీ వేదికపై చంద్రబాబుతో కలిసి ప్రకటన చేయనున్నారు. అటు చంద్రబాబుతో కలిసి ఎన్నికల బహిరంగ సభల్లో సైతం పాల్గొనన్నారు. ఒకవైపు ఒంటరిగానే సభల్లో పాల్గొంటూనే.. ఎక్కడికక్కడే టిడిపి నేతలతో సమన్వయం చేసుకొనున్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు లభించే నియోజకవర్గాల్లో సైతం పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే జనసేనలో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా జనసేన బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కసరత్తులో జనసేన నాయకత్వం ఉంది.