Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించిన బాల రాముడి విగ్రహానికి నిన్నటి వరకు కళ్లకు గంతలు కట్టి కనిపించాయి. అభిజిత్ లగ్నంలో జనవరి 22(సోమవారం) మధ్యాహ్నం 12:29:29 గంటల నుంచి 84 సెకన్లపాటు నిర్వహించిన కార్యక్రమంలో బాల రామునికి గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట చేశారు. బంగారు ఆభరణాలతో అలంకరించిన బాల రాముడి దివ్య రూపాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. మనసంతా నీలమేఘ శ్యాముడిని స్మరించుకున్నారు. ఐదు దశాబ్దాల కల నెరవేరడంతో తనువెళ్లా పులకించిపోయారు. అయితే నిన్నటి వరకు రాయిగా ఉన్న విగ్రహం.. సోమవారం దివ్యకాంతితో వెలిగిపోతుండడం అందరినీ ఆశ్చర్య పర్చింది. ఇంతటి శక్తి విగ్రహానికి ఎలా వచ్చింది. రాయి రాముడిగా ఎలా మారింది అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.
ఐదు రోజుల ముందే రామ్ లల్లా..
అయోధ్య గర్భాలయంలో ప్రక్రియలో భాగంగా ఐదు రోజుల ముందే రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్యకు తీసుకువచ్చారు. గర్భగుడిలో ప్రతిష్టించారు. కానీ కళ్లకు మాత్రం గంతలు తొలగించలేదు. అయితే విగ్రహానికి దివ్య శక్తి దైవత్వం అలంకరణలో రాదు. ఆగమ శాస్త్రం ప్రకారం అది ప్రతిష్టించిన నేల కూడా ప్రధానం. రామయ్య ప్రతిష్టాపన కోసం అందుకే 5 దశాబ్దాలపాటు పోరాటం జరిదింది. నదీ తీరాలే ఆలయ నిర్మాణానికి అనువుగా ఉంటుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.
మూడు ఆగమ శాస్త్రాలు ఇలా..
మూడు ఆగమ శాస్త్రాల ఆధారంగా ఆలయాల నిర్మాణం జరుతుంది. వైష్టవ ఆలయాలను వైకానశ ఆగమని, శివాలయాలను స్మార్థ ఆగమనం, అమ్మవారి ఆలయాలకు శక్తి ఆగమశాస్త్రాల ఆధారంగా నిర్మాణం జరుగుతుంది. కొన్ని వేల ఏళ్లు నిలిచేలా ఆలయాలు నిర్మిస్తారు. వందల మంది భక్తులు గర్భగుడిలోకి వెళ్లినా ఆక్సిజన్ కొరత రాకుండా నిర్మాణం జరుగుతుంది.
రాయిని దేవుడిగా మలిచేందుకు..
ఆలయాల్లో ప్రతిష్టించే విగ్రహాలను రాతిని చెక్కి రూపొందిస్తారు. చిన్న చిన్న విగ్రహాలు చేతితో చెక్కుతారు. పెద్దపెద్ద విగ్రహాలు చెక్కేటప్పుడు శిల్పులు విగ్రహంపై ఎక్కుతారు. కానీ అప్పుడు అది దేవుడు కాదు. రాయి మాత్రమే ఆ రాయిని తీసుకువచ్చి దైవారాధనకు అనుకూలంగా మారుస్తారు.
అధివాస పూజలు..
ఆలయాల్లో ప్రతిష్టించేందుకు ముందు రాతి విగ్రహాలకు జలాధివాసం, ధాన్యాదివాసం, పుష్పాధివాసం, క్షీరాధివాసం, పంచశైనాధివాసం చేస్తారు.
జలాధివాసం : జలాధివాసం అంటే నీటితో విగ్రహాన్ని శుద్ధి చేస్తారు. వేలాది కలశాలతో నీటిని తెచ్చి అభిషేకిస్తారు. వివిధ నధుల నుంచి తెచ్చిన నీటిలో ఉంచుతారు. తద్వారా ఉలి తాకడంతో పుట్టిన వేడి తగ్గుతుంది. చల్లదనం వస్తుంది.
ధాన్యాధివాసం : విగ్రహాన్ని ధాన్యంలో ఉంచడాన్నే ధాన్యాదివాసం అంటారు. విగ్రహం నుంచి వచ్చే వేడి హెచ్చుతగ్గులను ధాన్యం నియత్రిస్తుంది. అవసరమైన వేడిని మాత్రమే ఉంచి మిగతా వేడిని తొలగిస్తుంది.
పుష్ఫాధివాసం : విగ్రహాన్ని పూలలో ఉంచడాన్ని పుష్పాధివాసం అంటారు. పూలలోని సున్నితత్వం విగ్రహంలోకి చేరడానికి ద్వింగా మారడానికి, సుందరరూపం రావడానికి ఇలా చేస్తారు.
క్షీరాధివాసం : విగ్రహాన్ని శుద్ధి చేసేందుకు పంచామృతంలో ఉంచడాన్ని క్షీరాధివాసం అంటారు. ఇందుకోసం పాలు, తేనె, నెయ్యి, పెరుగు, కొబ్బరి నీళ్లువినియోగిస్తారు.
పంచశైనాధివాసం : వివిధ ఉపచారాలు చేయడాన్ని పంచ శైనాధివాసం అంటారు.
ఇలా వివిధ అధివాసాలు చేయడం ద్వారా శిలారూపం దేవుడిగా, ఆరాధించే విగ్రహంగా మారుతుంది. తర్వాత విగ్రహాలను ఊరేగిస్తారు. దీనిద్వారా దేవుడి హద్దులు పాలించాల్సిన గ్రామం, ప్రజలను చూపిస్తారు. ఇలా చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ట చేస్తారు.
అయోధ్య బాల రాముడికి కూడా ఇవన్నీ నిర్వహించడంతో ఐదు రోజుల క్రితం చూసిన విగ్రహానికి, ప్రాణ ప్రతిష్ట తర్వాత చూసిన విగ్రహానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. దైవత్యం, సుందర రూపం ఉట్టిపడుతుంది.