Pawan Kalyan Film Celebrities: తెలుగు సినీ పరిశ్రమలో( Telugu cine industry ) ఇటీవల జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇంతవరకు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు సీఎం చంద్రబాబును కనీస మర్యాదగా కలవక పోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. పరిశ్రమకు మేలు చేస్తే కనీసం పట్టించుకోలేదని.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తరువాత సినీ పెద్దలు స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వారు మద్దతు ప్రకటించారు. పవన్ సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు సినీ పెద్దలు నిర్ణయించారు. దాదాపు 30 మందితో కూడిన ప్రముఖుల బృందం సీఎం చంద్రబాబును కలవనుంది. అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ఏడాది పాలన పూర్తవుతున్న తరుణంలో సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* కూటమికి మద్దతుగా పరిశ్రమ..
2024 ఎన్నికల్లో కూటమి వైపు మొగ్గు చూపింది సినీ పరిశ్రమ. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress హయాంలో సినీ పెద్దలకు అవమానం జరిగిందని.. సినీ పరిశ్రమ విషయంలో వైసీపీ నేతలు దూకుడుగా ప్రదర్శించారన్న విమర్శలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమ వ్యక్తులు ఎక్కువమంది కూటమి వైపు మొగ్గు చూపారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సైతం సినీ పరిశ్రమ పరోక్షంగా మద్దతు తెలిపింది. ఇంకో వైపు టిడిపి పట్ల కూడా సానుకూలత వ్యక్తం అయింది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమ సైతం సంతృప్తి వ్యక్తం చేసింది. అటు చిన్న, పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు ఎవరికివారుగా టికెట్ల పెంపునకు అనుమతి తీసుకుంటున్నారు. ప్రభుత్వం సైతం వారికి అనుమతి ఇస్తూ వస్తోంది. అయితే అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సినీ ప్రముఖులు కలిశారు. ఏపీ సీఎం చంద్రబాబును కలవాలని పవన్ సూచించారు. మరి ఎందుకో సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవలేదు. దానిని తప్పు పట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
*థియేటర్ల బంద్ ప్రకటనతో
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే అని వారి కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన చిత్రం విడుదలకు ముందు థియేటర్ల బంద్ ప్రతిపాదన లో కుట్రపూరిత వాతావరణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంటే ఏపీ సీఎం చంద్రబాబును సినీ ప్రముఖులు కలవకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు కూడా చేయించారు. అయితే దీనిపై అల్లు అరవింద్, దిల్ రాజు లాంటివారు స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతించారు. దిల్ రాజు అయితే పవన్ కళ్యాణ్ చిత్రాలను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ తనకు అన్నతో సమానమని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా సినీ పరిశ్రమ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* 15న అపాయింట్మెంట్..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది అవుతోంది. అందుకే సంబరాలు చేసుకునేందుకు కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఈనెల 15న సాయంత్రం ఐదు గంటలకు సినీ ప్రముఖులు చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సినీ పరిశ్రమకు చెందిన 30 మంది ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. మొత్తానికైతే కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత.. అది కూడా డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరికతో సీఎంను సినీ ప్రముఖులు కలుస్తుండడం విశేషం.