Pawan Kalyan: ఆ రెండు పదవులు ఖరారు చేసిన పవన్

Pawan Kalyan: ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన సంపూర్ణ విజయం సాధించింది. జనసేన కు చెందిన పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు మంత్రి పదవులు దక్కాయి

Written By: Dharma, Updated On : July 1, 2024 5:43 pm

Pawan Kalyan proposal of two janasena leaders names as whips

Follow us on

Pawan Kalyan: పాలనలో తనదైన మార్కును చూపించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. శాఖల పరంగా వరుసగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఈరోజు సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు పవన్. ముఖ్యంగా అసెంబ్లీలో తన పార్టీ నుంచి విప్ ల నియామకంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన సంపూర్ణ విజయం సాధించింది. జనసేన కు చెందిన పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు మంత్రి పదవులు దక్కాయి. టిడిపికి అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కడంతో.. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన ఆశిస్తోంది. అయితే దీనిపై టిడిపి నుంచి సరైన సంకేతాలు రావడం లేదు. దీనిపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీలో చీఫ్ విప్ గా ధూళిపాళ్ల నరేంద్ర ను నియమించారు. విప్ లుగా మూడు పార్టీల నేతలకు అవకాశం దక్కనుంది. అయితే జనసేన నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఎంపిక చేస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు నుంచి గెలిచిన శ్రీధర్ పేర్లను సిఫారసు చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ ఇద్దరూ అసెంబ్లీలో తమ పార్టీ విప్ లుగా ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు వెలువడనున్నాయి.

అయితే డిప్యూటీ స్పీకర్ గా జనసేనకు చంద్రబాబు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జనసేన ఏకైక మహిళ ఎమ్మెల్యే లోకం మాధవికి పదవి దక్కుతుందని ప్రచారం సాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లోకం మాధవి అత్యధిక మెజారిటీతో గెలిచారు. జనసేనకు ఉన్న ఏకైక మహిళ ఎమ్మెల్యే కూడా ఆమె. భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. ఆమె మాత్రం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం క్యాబినెట్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏ పదవి కేటాయించలేదు. గతంలో వైసిపి ప్రభుత్వం సైతం డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆ వర్గానికే కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. నెల్లిమర్ల ఎమ్మెల్యే అయితేనే సరిపోతారని జనసేన వర్గాలు ఆశిస్తున్నాయి. కానీ చంద్రబాబు మదిలో ఏముందో తెలియాలి.