NEET UG 2024 : నీట్ యూజీ ఫలితాలు వెళ్లడయ్యాయి.. ర్యాంకుల జాబితా ఎలా మారిందంటే..

NEET UG 2024 ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.. పోలీసులు పది మంది దాకా నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

Written By: NARESH, Updated On : July 1, 2024 5:44 pm

NEET

Follow us on

NEET UG 2024 : పేపర్ లీక్, అక్రమాలు చోటు చేసుకోవడం, గ్రేస్ మార్కులు కలపడం.. వంటి ఆరోపణలు వినిపించడం.. సుప్రీంకోర్టు తలంటడంతో జాతీయ పరీక్ష మండలి (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) మరో మారు వైద్య విద్య కోసం ప్రవేశాల కోసం నీట్ యూజీ -2024 పరీక్ష నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్ళీ పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల ఫలితాలను సోమవారం వెల్లడించింది. దీంతోపాటు నీట్ యూజీ 2024 అభ్యర్థుల ర్యాంకులను కూడా సవరించినట్టు ప్రకటించింది..

జాతీయ పరీక్ష మండలి తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 1,563 మందికి నీట్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. అయితే ఇందులో 813 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఏకంగా 750 మంది పరీక్షకు గైరాజరయ్యారు. అయితే పరీక్ష రాసిన వారి ఫలితాలను జాతీయ పరీక్షా మండలి విడుదల చేసింది. నీట్ ఫైనల్ ఆన్సర్ – కీ ని వైబ్ సైట్ లో పెట్టింది. ఈ ఫలితాల అనంతరం నీట్ పరీక్ష రాసిన అభ్యర్థుల ర్యాంకులన్నీ మారినట్టు జాతీయ పరీక్ష మండలి అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సవరించిన స్కోర్ కార్డులను https//: exams.nta. ac.in/NEET/ లో చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వారు ప్రకటించారు. అయితే పరీక్ష రాసిన అభ్యర్థుల ర్యాంకులు మొత్తం మారడంతో.. సుప్రీంకోర్టు అనుమానమే నిజమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియా ఇదే కోణంలో పలు వార్తలను ప్రసారం చేసింది కూడా.

ఇక జాతీయ పరీక్షా మండలి ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలలో ఏకంగా 67 మంది జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో పలు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. మూడోసారి కొలువ తీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నీట్ పరీక్షలో చోటుచేసుకున్న వివాదం తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు గ్రేస్ మార్కులు కలిపిన అభ్యర్థులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో జాతీయ పరీక్షా మండలి వారందరికీ పరీక్ష నిర్వహించింది. మరోవైపు బీహార్ కేంద్రంగా నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వినిపించాయి. ఇండియా టుడే నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అయితే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.. పోలీసులు పది మంది దాకా నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.