Pawan Kalyan: రాజకీయ పార్టీలన్నాక విరాళాలు పెద్ద ఎత్తున వస్తుంటాయి. పారిశ్రామికవేత్తలు, పేరు మోసిన వ్యాపారులు పార్టీలకు విరాళాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేనకు భారీ విరాళాలు వస్తున్నాయి. ఇలా విరాళాలు ఇచ్చి టికెట్లు అడిగిన వారి సంఖ్య ఎక్కువైంది. అందుకే విరాళాలు ఇచ్చే వారి విషయంలో పవన్ ఒకటికి రెండుసార్లుఆలోచించి తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఏకంగా ఏడుగురు ఇచ్చిన చెక్కులను పవన్ తిప్పి పంపించినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. సీట్ల సర్దుబాటు కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. శత శాతం గెలుపునకు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను, సీట్లను మాత్రమే పవన్ కోరుకున్నట్లు వార్తలు వచ్చాయి. అటు జనసేనకు సంబంధించి సీట్లు ఖరారు, అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తయినట్టు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కొంతమంది తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని నేరుగా పవన్ కు కోరుతున్నారు. తాము పెద్ద ఎత్తున పార్టీకి విరాళాలు అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే తమకు ఎలాగోల సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. దీంతో పవన్ కు ఇది ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. అందుకే విరాళాలు వెనక్కి ఇచ్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఆ సమయంలో విరాళాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కనీసం 10 లక్షల రూపాయల కూడా అందించిన దాఖలాలు లేవు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదరడంతో భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఇస్తున్నవారు పార్టీపై అభిమానంతో కాకుండా.. టికెట్ దక్కించుకోవాలన్న కాన్సెప్ట్ తో ఉన్నారు.వారికి పార్టీ విధానాలపై కానీ.. అధినేత పై అభిమానం కానీ కాదు. రాజకీయంగా ఒక ప్లాట్ ఫామ్ కావాలి. తెలుగుదేశంతో పొత్తు ఉండడంతో ఎలాగైనా సీటు దక్కించుకొని ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వారే అధికం. అటువంటివారు వివిధ మార్గాల ద్వారా జనసేన నాయకత్వానికి టచ్ లోకి వస్తున్నారు. పార్టీలో చేరకముందే సేవాభావంతో విరాళాలు అందిస్తున్నట్లు చెబుతున్నారు. తీరా తమకు టిక్కెట్ సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. దీంతో ఇది చికాకు పెట్టే అంశంగా మారడంతో పవన్ ముందుగానే మేల్కొంటున్నారు. విరాళాలకు ఛాన్స్ లేదని తేల్చి చెబుతున్నారు.
అప్పట్లో ప్రజారాజ్యం విషయంలో ఇదే తరహా ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున విరాళాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకే ఈసారి జనసేన విషయంలో ఆ పరిస్థితి రాకుండా పవన్ కళ్యాణ్ ముందే మేల్కొంటున్నారు. ఇలా విరాళాలు ఇస్తున్న వారిలో ప్రో వైసిపి నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. అందుకే జనసేనపై ఎటువంటి కుట్రలకు, ఆరోపణలకు తావు లేకుండా పవన్ పారదర్శకంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. అందుకే విరాళాల బ్యాచ్ కు చెక్ చెప్పారు. మొత్తానికైతే వచ్చిన విరాళాలను తిప్పి పంపి.. పవన్ మంచి పని చేశారని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.