US Consulate Mason Jobs: మీరు తాపీ మేస్త్రా? భవన నిర్మాణ పనులు వచ్చా? రెండేళ్ల అనుభవం ఉందా? ఎనిమిదో తరగతి వరకు చదివారా?.. ఇవన్నీ ఉంటే మీకు ఓ సువర్ణ అవకాశం. పేరు మోసిన కంపెనీలో ఉద్యోగం. పిఎఫ్, ఈఎస్ఐ తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. భారీ మొత్తంలో వేతనం కూడా అందిస్తారు. ప్రమాద బీమా, ఇతరత్రా భద్రత ప్రమాణాలు సైతం పాటిస్తారు. ఇలా ప్రకటన ఇచ్చింది ఏదో అల్లాటప్ప కంపెనీ కాదు. హైదరాబాదులోని యూఎస్ కాన్సులేట్ జనరల్. ఈ ప్రకటన చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
సాధారణంగా డిగ్రీ చదివిన వారికి అవకాశాలు అంతంత మాత్రమే. వారికోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్లు సైతం ఉండవు. కానీ తాపీ మేస్త్రి పని కోసం ఏకంగా ఓ కార్పొరేట్ కంపెనీ నోటిఫికేషన్ జారీ చేయడం విశేషం. యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ కంపెనీ మంగళవారం ఎక్స్ ఖాతాలో నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాపీ మేస్త్రీల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటి అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
తాపీ మేస్త్రి ఉద్యోగానికి కొన్ని అర్హత పరీక్షలు సైతం నిర్వహించనున్నారు. ఎనిమిదో తరగతి చదివిన వారు అర్హులు. ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. హిందీ లేదా తెలుగు భాష మాట్లాడగలగాలి. ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, కాంక్రీట్ బాక్స్ వాల్, స్టోన్ లేయింగ్, కటింగ్, బ్రిక్ వర్క్స్ తదితర పనుల్లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. వార్షిక వేతనంగా రూ.4.47 లక్షలు అందించనున్నారు. ఫిబ్రవరి 25 తేదీలోగా దరఖాస్తు చేయవలసి ఉంటుంది. అర్హత పరీక్షలు ముఖాముఖిగా నిర్వహించనున్నారు. పనితీరు పరిశీలన తరువాత నియామక పత్రాలు అందించనున్నారు.