Pawan Kalyan Cabinet Meeting: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ భేటీ జరుగుతోంది. అయితే దీనిని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కానీ మధ్యలో కొన్నిసార్లు సమావేశాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరవుతూ వచ్చారు. ఈరోజు జరగాల్సిన క్యాబినెట్ సమావేశానికి సైతం పవన్ కళ్యాణ్ హాజరు కారు అని తెలుస్తోంది. అయితే ఇలా పవన్ గైర్హాజరైన ప్రతిసారి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నడుస్తూ వస్తోంది. కూటమిలో విభేదాలు కారణం అంటూ ప్రచారం చేస్తుంటారు. అటు తర్వాత అటువంటిదేమీ లేదని తెలుస్తూ ఉంటుంది. ఈసారి కూడా పవన్ గైర్హాజరు వెనుక బలమైన కారణం ఉంది. దీనిపై ముందుగానే క్లారిటీ వచ్చింది.
* ఢిల్లీ టూర్ లో..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరుపుతున్నారు. కేంద్ర పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో నిన్ననే ఆయన ఢిల్లీ వెళ్లారు. అందుకే సచివాలయంలో జరగాల్సిన క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విభజన హామీల అమలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
* అమిత్ షా అపాయింట్మెంట్ తో..
సాధారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ( Delhi) వెళ్ళేది చాలా తక్కువ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ చాలా కాలం తర్వాత ఖరారు కావడంతో పవన్ ఢిల్లీ వెళ్లారు. అదే సమయంలో క్యాబినెట్ సమావేశం ఉండడంతో సీఎం చంద్రబాబు అనుమతి తీసుకున్నారు. అయితే పవన్ క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరైతే జరిగే వ్యతిరేక ప్రచారం తెలుసు. ఇప్పుడు కూడా వ్యతిరేక మీడియా అదే ప్రచారం చేస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ముందే సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీ సోషల్ మీడియా తోక ముడిచింది. లేకుంటే లేనిపోని ప్రచారానికి దిగేది. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇంకోవైపు రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళనున్నారు పవన్. అయితే వరుసగా ప్రభుత్వ పెద్దల విదేశీ పర్యటనలు, ఢిల్లీ టూర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం రుచించడం లేదు.