Pawan Kalyan: పవన్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు పవన్ తీసుకున్న అంశాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. జగన్ హయాంలో జరిగిన కుంభకోణాలు, పాలన వైఫల్యాలు, కేంద్రం వద్ద మోకరిల్లడం వంటి అంశాలను టార్గెట్ చేసుకుంటూ వారాహి యాత్రలో పవన్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లేవనెత్తాల్సిన అంశాలను.. ఇప్పుడు పవన్ లీడ్ తీసుకొని ప్రస్తావిస్తుండడం విశేషం.
లోక్సభలో వైసీపీ సంఖ్యా బలం 22. గత ఎన్నికల్లో 25 స్థానాలకు గాను.. వైసిపి దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. బహుశా కేంద్ర ప్రభుత్వం జగన్ కు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఆ సంఖ్యా బలమే ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వ అవసరాలకు పనికొస్తున్నారని.. జగన్కు ప్రజాబలం ఉందని కేంద్ర పెద్దలు నమ్మకం పెట్టుకోవడం వెనుక ఎంపీల బలమే ఉందన్నది ఒక అభిప్రాయం. ఇప్పుడు దాని పైనే పవన్ ఫోకస్ పెట్టారు. 22 మంది ఎంపీలు ఉంటే ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంతో పోరాడాలని జగన్ కు సూచిస్తున్నారు. విభజన హామీల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు జగన్ సైతం ఇదే మాదిరిగా టిడిపి పై ఒత్తిడి పెంచారు. ప్రజల్లో టిడిపిని పలుచన చేయగలిగారు. ఇప్పుడు పవన్ సైతం అదే మాదిరిగా వ్యవహరిస్తుండడం విశేషం.
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం, ఇసుక, మట్టి మాఫియా పెట్రేగిపోయింది. ఇప్పుడు వీటిపైనే పవన్ ఫోకస్ పెట్టారు. వైసీపీ నేతలు ఆకాశమంత అవినీతి చేస్తున్నారని.. వేలకోట్ల రూపాయలు దోచేశారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల ఇళ్ళకు 8200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే
.. అందులో 4000 కోట్ల రూపాయలు నూటి చేశారని సరికొత్త ఆరోపణ చేశారు. ఇది కూడా కొత్త అంశం. గతంలో వైసీపీ సర్కార్ చేపడుతున్న గృహ నిర్మాణాన్ని పరిశీలించే క్రమంలో ఒక నివేదికనే రూపొందించుకున్నారు పవన్. ఇప్పుడు దానిని బయటపెట్టారు.
మరోవైపు తాను నోరు తెరిస్తే వైసీపీ నేతలు తనపై టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. పావలా ప్యాకేజీ అంటూ ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో వైసిపి నేతలపైనే ఒక కౌంటర్ అటాక్ ప్రారంభించారు పవన్. ఇది రూపాయి పావలా ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. పార్టీ శ్రేణులకు ఒక పిట్ట కథ చెప్పుకొచ్చారు. ” నేను నెల్లూరులో ఉండే సమయంలో మా ఇళ్ల వద్దకు బొమ్మలు అమ్మే వాళ్ళు వచ్చేవారు. బొమ్మ రూపాయి పావలా అనే అరిచేవారు. బొమ్మ కొనుక్కుందామని అమ్మ వద్ద రూపాయి పావలా తీసుకుని వెళ్తే.. ఆ బొమ్మలు అయిపోయాయి. కావాలంటే నాలుగు, ఐదు రూపాయల బొమ్మలు ఉన్నాయంటూ అమ్మే వాళ్ళు చెప్పేవారు. ఆ బొమ్మల కోసమే రూపాయి పావలా అంటూ వారు అరిచేవారని.. బొమ్మలు అమ్మేవాడు తన వద్దకు రప్పించేందుకు అలా చేసేవాడు. అది వాడి స్ట్రాటజీ”.. ఇప్పుడు జగన్ సైతం నవరత్నాల ద్వారా ఆ స్ట్రాటజీని అమలు చేశారు. అందుకే ఇది రూపాయి పావలా ప్రభుత్వం అంటూ పవన్ ఎద్దేవా చేశారు.
అటు జగన్ క్లాస్ వార్ కామెంట్స్ పై సైతం పవన్ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ ఉపాధి కూలీల పొట్ట కొట్టారు. దేశంలో కెల్లా ఏపీలోనే ఉపాధి హామీపై అత్యధిక ఫిర్యాదులు వెళ్లినట్లు కేంద్రమంత్రి ప్రకటించడం సిగ్గుచేటు అని చెప్పుకొచ్చారు. ఒకటి పాయింట్ 1.59 లక్షలు ఫిర్యాదులు వచ్చాయని.. 337 కోట్లు ఉపాధి నిధులు దారి మళ్లించారని కేంద్రం గుర్తించినట్లు పవన్ చెబుతున్నారు. ఇలా వైసీపీ సర్కార్ వైఫల్యాలతో పాటు కుంభకోణాలను పవన్ ప్రస్తావిస్తుండడం విశేషం. అన్నింటికంటే మించి తన భాగస్వామ్యమైన ఎన్డీఏ ప్రభుత్వం పై పోరాటం చేయాలని జగన్ ను సూచిస్తుండడం తెలివైన పనిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైసిపి మాటున బిజెపికి పవన్ షాక్ ఇస్తున్నట్టేనని విశ్లేషిస్తున్నారు.