Deputy CM Pavan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలుగు సినీ పరిశ్రమ ఆకాంక్షించింది. కూటమి ప్రభుత్వం వస్తేనే సినీ పరిశ్రమకు న్యాయం జరుగుతుందని నమ్మింది.కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టడంతో సినీ పరిశ్రమ ఎంతగానో సంతోషించింది.ప్రతి విభాగానికి చెందిన నిపుణులు,నిర్మాతలు.. సినిమాకు మంచి రోజులు వచ్చాయి అనే విషయాన్ని పలు వేదికలపై వ్యక్తం చేస్తూ వస్తున్నారు.తెలుగు సినీ పెద్దలు, నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ ను కలిశారు. అభినందనలు సైతం తెలిపారు. సినీ రంగ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబుతో కలిసే ఏర్పాట్లు చేస్తానని కూడా వారికి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ అంతా పవన్ కళ్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.అందుకు తగ్గట్టుగా పవన్ సైతం కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమను ఏపీకి విస్తరించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.విశాఖ,విజయవాడ, తిరుపతి నగరాలతో పాటు గోదావరి జిల్లాల్లో సినిమా షూటింగ్లకు అనువుగా కొన్ని ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతకంటే ముందుగా గత ఐదేళ్ల వైసిపి పాలనలో సినీ పరిశ్రమపై అడుగడుగునా ఆంక్షలు కొనసాగాయి. వాటన్నింటినీ తొలగిస్తూ ముందుగా స్వేచ్ఛ ఇచ్చారు.
* వైసిపి హయాంలో ఇబ్బందులు
వైసిపి హయాంలో సినీ పరిశ్రమ కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. అంతకుముందు కోవిడ్ తో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తరువాత వైసీపీ సర్కార్ పరిశ్రమను వెంటాడడం ప్రారంభించింది. కేవలం పవన్ పై ఉన్న కోపంతో అతి తక్కువ ధరకు టికెట్లను కోట్ చేసింది. పోలీసులను, అధికారులను ఉసిగొల్పి.. కొన్నిచోట్ల థియేటర్లను సైతం సీజ్ చేసింది. అటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ దుస్థితిని వివరించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఓ టీం అప్పటి సీఎం వైయస్ జగన్ ను కలిసింది. ఆ సమయంలో చేతులు జోడించి వేడుకున్న చిరంజీవి ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అత్యంత వివాదాస్పదం అయ్యాయి.
* కూటమి రావడంతో ఉపశమనం
అయితే చాలా రకాల ఇబ్బందులు పడింది సినీ పరిశ్రమ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఊపిరి పీల్చుకుంది. మొన్న ఆ మధ్యన సినీ నిర్మాతలు, పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ ను కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న పరిస్థితులపై చర్చించారు. పవన్ సైతం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో వారితో ఏకీభవించారు. సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
* యాక్షన్ ప్లాన్ లోకి పవన్
తాజాగా పవన్ యాక్షన్ ప్లాన్ లోకి దిగారు. ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణకు అవసరమైన సత్వర చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా సినిమా షూటింగ్లకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. మరోవైపు స్టూడియోల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి రాజధాని తో పాటు మిగతా ప్రాంతాల్లో సైతం ఈ స్టూడియోల నిర్మాణానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో సీఎం చంద్రబాబుతో ఉన్నతస్థాయి భేటీ ఒకటి ఏర్పాటు చేసి.. ప్రభుత్వం నుంచి తీసుకున్న నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.