Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సికే రవిచంద్రన్ అనే నాయకుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆగస్టు 19న బెంగళూరులో ఆయన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా గుండెపోటు సంభవించింది. చూస్తుండగానే ఆయన కుర్చీ నుంచి కింద పడిపోయి క్షణకాలంలోనే కన్నుమూశాడు. తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అతడిని కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. సీకే రవిచంద్రన్ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( ముడా) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అందరూ చూస్తుండగానే ప్రాణాలను కోల్పోయాడు.
జీకే రవిచంద్రన్ మరణం కాంగ్రెస్ పార్టీలో తీరని విషాదాన్ని నింపింది. రవిచంద్రన్ మరణాన్ని తోటి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చూస్తుండగానే గుండెపోటు రావడం, ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోవడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. సీకే రవిచంద్రన్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత దగ్గరి అనుచరుడిగా రవిచంద్రన్ కొనసాగుతున్నారు. ఈయన స్వస్థలం కోలార్ ప్రాంతంలోని చింతామణి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోలార్ ప్రాంతంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ తప్పిదాలను ఎక్కడికక్కడ ఎండగట్టారు. సోషల్ మీడియాలోనూ రవిచంద్రన్ అత్యంత యాక్టివ్ గా ఉంటారు. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని మొదటి నుంచి రవిచంద్రన్ వ్యతిరేకిస్తున్నారు. సిద్ధరామయ్యకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. సిద్ధరామయ్య పై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో గవర్నర్ తీరును రవిచంద్రన్ తప్ప పడుతున్నారు. గవర్నర్ వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విలేకరుల సమావేశంలో గవర్నర్ పై విమర్శలు చేస్తుండగానే ఆయన ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావడం.. వెంటనే కన్నుమూయడంతో కర్ణాటక రాష్ట్రంలో కలకలం నెలకొంది.
దీనిపై కొంతమంది వైద్యులు మాట్లాడుతూ.. రవిచంద్రన్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని.. అందువల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఇలాంటి తీవ్రమైన గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేసినప్పటికీ ఉపయోగం ఉండదని వారు వివరిస్తున్నారు.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారానే గుండెపోటు మరణాలను నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలని సూచిస్తున్నారు. మాంసాహారం కూడా మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తే గుండెపోటును నివారించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.. ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలని.. అప్పుడే గుండె భద్రంగా ఉంటుందని సూచిస్తున్నారు.