Pawan Kalyan Health : ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పవన్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ ఎన్నికల ప్రకారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభం నాడే జ్వరం బారిన పడ్డారు. ఆ మరుసటి రోజే వైద్యానికి హైదరాబాద్ వెళ్లారు. అయితే అక్కడ నుంచి ప్రతిరోజు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నా.. పవన్ కు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ప్రజాక్షేత్రంలో ఎక్కువసేపు ఉండలేక అనారోగ్య సమస్యలు అంటూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారంటూ వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పించాయి. ఈ తరుణంలో పవన్ అనారోగ్యంపై జనసేన ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం విశేషం.
ప్రస్తుతం పవన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. గజమాలలు వేయవద్దని.. పూలు జల్ల వద్దని జనసేన హై కమాండ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పవన్ అనారోగ్య సమస్య దృష్ట్యా పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది. పవన్ రెకరెంట్ ఇన్ఫ్లూ యాంజతో బాధపడుతున్నారని తెలిపింది. దీనికి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి రోజు ఏదో ఒక సమయంలో పవన్ జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది. అందుకే క్రేన్ తో గజమాలల ఏర్పాటు, కరచలనాలు, ఫోటోల కోసం ఒత్తిడి చేయవద్దని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు.
వారాహి విజయ భేరీ యాత్రలో పవన్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రజా గళం ఉమ్మడి ప్రచారంలో కూడా పాలుపంచుకుంటున్నారు. జనసేన పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మిగతా భాగస్వామ్య పక్షాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల నుంచి పవన్కు ప్రత్యేక వినతులు వస్తున్నాయి. కానీ సమయాభావంతో పవన్ హాజరు కాలేకపోతున్నారు. మరోవైపు అనారోగ్య సమస్యలు తలెత్తుతుండడంతో జనసేన హై కమాండ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.