Pawan Kalyan: మెగా బ్రదర్ నాగబాబు మంత్రి అయ్యేది ఎప్పుడు? ఆయనను మంత్రివర్గంలో తీసుకునేది ఎప్పుడు? ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగబాబు పేరు ప్రధానంగా వినిపించింది. కానీ వివిధ సమీకరణలో భాగంగా జనసేనకు ఛాన్స్ లేకుండా పోయింది. అనూహ్యంగా బిజెపికి ఒక పదవి కేటాయించాల్సి వచ్చింది. అయితే అప్పటికే నాగబాబుకు రాజ్యసభ పదవి ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం నడిచింది. చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో ఆయనకు పదవి దక్కకుండా పోయింది. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ ఇది జరిగి నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఈ తరుణంలో నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా? లేదా? అన్న చర్చ నడిచింది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాగబాబును తప్పకుండా మంత్రివర్గంలో తీసుకుంటామని.. అయితే ఇది ఇప్పుడే కాదని.. తేల్చి చెప్పారు పవన్.
* ఎమ్మెల్సీ అయిన తరువాతే
నాగబాబు ప్రస్తుతం ఏ చట్టసభల్లోనూ సభ్యుడు కారు. మంత్రి కావాలంటే తప్పకుండా ఎమ్మెల్యేగా కానీ.. ఎమ్మెల్సీ కానీ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మంత్రిగా తీసుకుంటే తప్పకుండా ఆరు నెలల్లో చట్టసభలకు ఎంపిక కావాలి. ఆయన గురించి ఎమ్మెల్యే సీటును వదులుకోవాల్సి ఉంటుంది. ఉప ఎన్నికలు ఆయన పోటీ చేసి ఎమ్మెల్యే కావాల్సి ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్న వారిని సైతం మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు నాగబాబును ఎమ్మెల్సీ చేసి.. మంత్రివర్గంలో తీసుకోవాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అయిన తరువాతే నాగబాబును మంత్రిగా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో నాగబాబు విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ తరువాతే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని స్పష్టత వచ్చింది.
* ఏప్రిల్ లోనే?
వైసిపి తో పాటు ఎమ్మెల్సీ పదవులకు ఓ ఐదుగురు రాజీనామా చేశారు. వారి రాజీనామాకు మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదం తెలపలేదు. మరోవైపు చాలామంది వైసీపీ ఎమ్మెల్సీలు మార్చిలో పదవీ విరమణ చేస్తారు. ఈ లెక్కన ఒక 11 మంది ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మార్చి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పుడే నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తాజాగా పవన్ మాటలు బట్టి తెలుస్తోంది. అయితే నాగబాబు ఒక్కరే కాదు మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. అంతవరకు నాగబాబుకు మంత్రి పదవి చాన్స్ లేదని తెలుస్తోంది.