Harirama Jogaiah: ఏపీలో పొత్తుల వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య రాస్తున్న లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. కాపు సంక్షేమ సంఘం ప్రతినిధిగా ఆయన వరుసగా లేఖలు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన జనసేనకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. మొన్న ఆ మధ్యన కాపు రిజర్వేషన్ పై నిరసన దీక్ష చేపట్టారు. ఆ సమయంలో పవన్ స్వయంగా వెళ్లి హరి రామ జోగయ్యను పరామర్శించారు. నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అప్పటినుంచి హరిరామ జోగయ్య చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో.. మెజారిటీ సీట్లు జనసేనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే కాపుల ఓట్లు కూటమికి బదలాయింపు సక్రమంగా జరుగుతుందని చెప్పుకొస్తున్నారు.
ఇటీవల హరి రామ జోగయ్య ఒక లేఖ రాశారు. ఏకంగా ఆ లేఖలో 60 అసెంబ్లీ స్థానాలకు, పది పార్లమెంటు స్థానాలకు జనసేన అభ్యర్థులు ఉన్నారంటూ ప్రకటించారు. మెజారిటీ కాపు సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాల్సిందేనని తేల్చి చెప్పారు. చిరంజీవి అభిమన్యుడిగా మిగిలారని.. పవన్ మాత్రం చివరి వరకు పోరాటం చేసి విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. జనసేనకు మెజారిటీ సీట్లు కట్టబెడితేనే కూటమి సక్సెస్ అవుతుందని తేల్చి చెప్పారు. లేకుంటే మాత్రం వృధా ప్రయాసగా మిగులుతుందని.. కానీ పవన్ పొత్తులో భాగంగా మెజారిటీ సీట్లు దక్కించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మొన్నటికి మొన్న పవన్ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. పొత్తులపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎవరైనా మాట్లాడితే వారు పొత్తుకు విఘాతం కలిగించే వారేనని తేల్చి చెప్పారు. ఇబ్బందులు వస్తే తనను సంప్రదించాలని సూచించారు. అయితే ఇప్పుడు వరుసగా హరి రామ జోగయ్య లేఖలు రాయడం వెనుక పవన్ ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. అయితే హరి రామ జోగయ్య లేఖల ప్రస్తావన.. బిజెపి నేతల ప్రకటన ఒకే మాదిరిగా ఉంటున్నాయి. దీంతో హరి రామ జోగయ్య వెనుక ఉన్నది పవన్ కాదని.. బిజెపి ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.