Pawan – YCP : పవన్ అంటేనే వైసీపీకి ఒక రకమైన జలసీ. అతడు నాయకుడంటే ఒప్పుకోలేని మనస్తత్వం ఆ పార్టీది. రెండుచోట్ల ఓడిపోయాడు అన్న చులకన భావం అడుగుఅడుగున ఉండిపోయింది. రాజకీయాల్లో గెలుపే పరమావధిగా ఆ పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో 7 శాతం మంది పవన్ ను యాక్సెప్ట్ చేశారన్న సంగతిని మరిచిపోయి వ్యవహరిస్తోంది. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గెలుపుకైనా.. ఓటమికైనా ఒక్క ఓటు చాలు. ఇప్పుడు ఆ పవరే పవన్ వద్ద ఉంది. అందుకే ఇప్పుడు పవన్ ని ఆ పార్టీ గుర్తించడం ప్రారంభించింది. ఆయన్నుంచి వస్తున్న మాటలను ఆస్వాదిస్తోంది. పవనే తమకు వరంలా భావిస్తోంది.
ఇటీవల పవన్ పై వైసీపీ విమర్శల జడివానను తగ్గించింది. పవన్ ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నా.. అదే స్థాయిలో విమర్శించడం లేదు. స్పందించిన వరకే పరిమితమవుతోంది. అటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ సైతం తగ్గి వ్యవహరిస్తోంది. అయితే దీనికి కారణం పవన్ కళ్యాణే. ఆయన నుంచి వస్తున్న మాటలే. విడిగా వస్తున్నాను అన్న పవన్ మాట వైసీపీకి వినసొంపుగా వినిపిస్తోంది. తనకే ఓటెయ్యాండి అంటూ చేస్తున్న విన్నపం ఆకట్టుకుంటోంది. ఒక్కసారి సీఎం చాన్స్ అన్న మాట తెగ ఆకర్షిస్తోంది. పవన్ అలానే మాట్లాడాలని వైసీపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. అందుకే పవన్ ఎన్ని విమర్శలు చేసినా తగ్గి ఉంటున్నారు.
మొన్నటివరకూ పవన్ కూటమి మాటనే ఇండైరెక్ట్ గా ప్రస్తావించేవారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని స్పష్టం చేసేవారు. టీడీపీతో కలిసి వెళతానని సంకేతాలిచ్చారు. అవసరమైతే బీజేపీకి కలుపుకెళతామని ఢిల్లీ వెళ్లి మరీ అగ్రనేతలను కలిశారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వైసీపీ విముక్త ఏపీయే తన లక్ష్యమని ప్రకటించేవారు. దీంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమయ్యేది. పవన్ అంటేనే వైసీపీ నేతలకు కంపరం పుట్టేది. అందుకే చెడమడ తిట్టి పోసేవారు. తిట్ల దండకాన్ని అందుకునేవారు. పురుష పదజాలాన్ని ప్రయోగించేవారు.
వారాహి పాదయాత్ర నుంచి పవన్ స్వరం మారింది. వైసీపీ సైతం స్వరం మార్చుకుంది. పవన్ తమను పురుష పదజాలంతో తిడుతున్నా ఆ స్థాయిలో ప్రతిస్పందించడం లేదు. విడిగా పోటీచేస్తానన్న హామీ, సీఎం పదవి కోసం ఒక్క చాన్స్ నినాదం వారిని కట్టడి చేస్తోంది. పొత్తులపై పవన్ స్పష్టత ఇవ్వకపోవడంతో తెగ ఖుషీ అవుతోంది. మొన్నటి వరకూ మరోసారి తమ అధికారానికి పవనే అడ్డంకి అని భావించిన వైసీపీ.. ఇప్పుడు అదే పవన్ ను వరంలా భావిస్తోంది. టీడీపీతో జనసేన పొత్తులుండవని లెక్కలు కడుతోంది. అయితే పవన్ వ్యూహాత్మకంగా అలా మాట్లాడుతున్నారా? తమను ట్రాప్ చేస్తున్నారా? అన్న అనుమానం మాత్రం వారిని వెంటాడుతోంది. వారి ఆశల మాదిరిగా పవన్ పొత్తులకు దూరంగా ఉంటారా? అన్నది చూడాలి.