Kolikapudi to join YSRCP: రాజకీయాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. ఒకే విధంగా ఉంటే అవి రాజకీయాలు కావు.. అప్పటిదాకా పరస్పర విమర్శలు చేసుకున్న వారు కలిసిపోతారు. అప్పటిదాకా కలిసి ఉన్న నాయకులు విడిపోతారు.. అందువల్లే రాజకీయాలను ఎవరూ స్పష్టంగా అంచనా వేయలేరు. ఇలానే జరుగుతుందని చెప్పలేరు. ఇందుకు ఉదాహరణే ఇది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గత ప్రభుత్వ తప్పులను వెలికి తీసే పనుల్లో కూటమి ప్రభుత్వం పడింది. ఇందులో భాగంగానే అక్రమాలకు పాల్పడ్డారంటూ కొంతమంది నేతలను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది.. అందులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఒకరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే లిక్కర్ కుంభకోణంలో ఆయన ప్రధాన పాత్రధారి అని.. వేల కోట్లను వేరే వైపు మళ్ళించారని ఆరోపిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం అభియోగాలు నమోదు చేసింది.. దీనికోసం బలమైన సాక్షాలను.. బలమైన ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టింది. న్యాయమూర్తి అనుమతితో ఆయనను రిమాండ్ కు తరలించింది. ప్రస్తుతం మిధున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయనను పరామర్శించడానికి తండ్రి రామచంద్ర రెడ్డి రాజమండ్రి వచ్చారు. రామచంద్ర రెడ్డి రాజమండ్రి విమానాశ్రయంలో ఉండగా ఆయనను టిడిపి ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్భంగా వారు ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. కొలికపూడి శ్రీనివాసరావు ఏం మాట్లాడారు? దానికి రామచంద్రారెడ్డి ఏం చెప్పారు? అసలు వీరిద్దరికి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద పనులు చేస్తున్నారు. వివాదాలు కు కేంద్ర బిందువుగా మారారు. దీంతో ఆయనపై టిడిపి అధిష్టానం ఆ గ్రహంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో కొలికపూడి శ్రీనివాసరావు టిడిపి ఆస్థాన మీడియాలో కనిపించేవారు. ఆయన విశ్లేషకుడిగా దర్శనమిచ్చేవారు. ఎప్పుడైతే టిడిపి అధిష్టానం ఆయన మీద ఆగ్రహం గా ఉందో.. అప్పటినుంచి శ్రీనివాసరావును టిడిపి ఆస్థాన మీడియా పక్కన పెట్టింది. మరోవైపు ఆయనపై వ్యతిరేకంగా కథనాలను ప్రచురిస్తోంది. ప్రసారం కూడా చేయిస్తోంది. ఇదే నేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియా శ్రీనివాసరావుకు పాజిటివ్ వార్తలు రాస్తూ ఉండడం విశేషం. అయితే అప్పట్లోనే శ్రీనివాసరావు వ్యవహార శైలి వేరే విధంగా ఉండడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత అలాంటిది ఏమీ లేదని సంకేతాలు ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Also Read: అరెస్టుకు కూత వేటులో ఇద్దరు మాజీ మంత్రులు!
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి శ్రీనివాసరావు నియోజకవర్గంలో అనేక వివాదాస్పద పనులకు పాల్పడ్డారు. ఒక అధికారి విషయంలో ఆయన అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై అధిష్టానం ఆయన నుంచి వివరణ కోరినట్టు వార్తలు వినిపించాయి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ శ్రీనివాసరావ్ విషయంలో టిడిపి అధిష్టానం కాస్త మెత్తబడినట్టు సమాచారం.. మళ్లీ ఇన్ని రోజులకు శ్రీనివాసరావు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఏకంగా వైసిపిలో కీలక నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. పైగా పెద్దిరెడ్డి మిధన్ రెడ్డి జైల్లో ఉండడం.. కూటమి ప్రభుత్వం రామచంద్ర రెడ్డి పై ఆగ్రహంగా ఉన్న ప్రస్తుత తరుణంలోనే కొలికపూడి శ్రీనివాసరావు ఆయనను కలవడం విశేషం.. అయితే టిడిపి అధిష్టానం ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో శ్రీనివాసరావు పార్టీ మారతారని చర్చ నడుస్తోంది. అందువల్లే రామచంద్ర రెడ్డి తో మంతనాలు జరుపుతున్నారని.. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫ్యాన్ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంతవరకు శ్రీనివాసరావు వర్గీయులు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కొద్దిరోజులుగా వారు మౌనంగానే ఉంటున్నారు. మరోవైపు శ్రీనివాసరావు స్థానికంగా ఉన్న టిడిపి క్యాడర్ కు దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.