Liquor Policy : ఏపీలో మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ.. ప్రైవేట్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపులు ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 1న ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. దరఖాస్తు రుసుము ద్వారా 2000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని భావించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే దరఖాస్తుల ప్రక్రియ ఆశాజనకంగా లేదు. చాలా షాపులకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం షాపులకు విపరీతంగా పోటీ పెరిగిందని ప్రచారం జరిగింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అయితే దరఖాస్తులు తక్కువగా రావడానికి స్థానిక ఎమ్మెల్యేల వైఖరి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరు దరఖాస్తులు వేయొద్దని.. వాటిని తమకు విడిచి పెట్టాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని.. తమకు వాటా ఇవ్వాల్సిందేనని.. అందుకు అంగీకరిస్తేనే దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. దీంతో మద్యం వ్యాపారులు వెనక్కి తగ్గుతున్నారు. అనవసరంగా మద్యం షాపులు దక్కించుకుని లేనిపోని ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న వారు మనకెందుకులే అని దరఖాస్తులు చేయడం లేదు.
* ప్రతి జిల్లాలోనూ ఆరోపణలు
ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేలు కలుగ చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒడిస్సా సరిహద్దు నియోజకవర్గాల్లో షాపులకు ఎటువంటి దరఖాస్తులు వేయవద్దని ఓ కీలక నేత ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిస్సా కు చెందిన ఓ ఎమ్మెల్యే తండ్రికి షాపులన్నీ వదిలేయాలని సదరు ప్రజాప్రతినిధి ఆదేశాలిస్తున్నట్లు సమాచారం. అదే జిల్లాల్లో రెండు నియోజకవర్గాల ముఖ్య ప్రజా ప్రతినిధులు ఇటీవల విశాఖలో మద్యం వ్యాపారులతో సమావేశం అయ్యారు. తమ నియోజకవర్గంలో దరఖాస్తులు చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పల్నాడు గుంటూరు, కృష్ణాజిల్లాలో అయితే ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలకు భయపడి వ్యాపారులు ఎవరు ముందుకు రావడం లేదు.
* ప్రభుత్వ ఆదేశాలు భే ఖాతరు
మద్యం పాలసీలో ఎటువంటి అవకతవకలు జరగవని ప్రభుత్వం చెబుతోంది. మద్యం షాపుల కేటాయింపులో తల దూర్చవద్దు కూడా ఎమ్మెల్యేలకు స్పష్టంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. అయినా సరే ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలు ఇందులో తలదూర్చుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఓ 961 షాపులకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం విశేషం. తిరుపతి జిల్లాలో అయితే 133 షాపులకు సంబంధించి దరఖాస్తులకు భూమి రాలేదు. నెల్లూరు జిల్లాలో 84, కాకినాడ జిల్లాలో 58, ప్రకాశం జిల్లాలో 60, శ్రీ సత్య సాయి జిల్లాలో 60, విశాఖ జిల్లాలో 60 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రానట్లు తెలుస్తోంది. 3396 షాపులకు గాను.. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 8274 మాత్రమే. అయితే విజయనగరంలో మాత్రం మద్యం దుకాణాలకు భారీ ఎత్తున దరఖాస్తులు రావడం విశేషం. అయితే మిగిలింది మూడు రోజులు మాత్రమే కావడంతో భారీ ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన 8274 దరఖాస్తుల ద్వారా 165 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే ఈపాటికే 30 వేల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి. కనీస స్థాయిలో కూడా దరఖాస్తులు రాకపోవడం విశేషం.