RS 10 Doctor : వైద్యో నారాయణో హరి అంటారు. పెరుగుతున్న రుగ్మతలతో వైద్యం కీలకంగా మారింది. ప్రస్తుతం ఏపీలో ఏ చిన్న ఆసుపత్రికి వెళ్లిన అవుట్ పేషంట్ సర్వీస్ కోసం.. కనీసం 200 రూపాయలు సమర్పించుకోవాల్సిందే. అటు తర్వాత వైద్య పరీక్షలు, మందులు, శస్త్ర చికిత్స కోసం భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే పేదల వైద్యం విషయంలో ఇప్పటికీ బాధ్యతగా మెలిగిన వైద్యులు చాలామంది ఉన్నారు. పది రూపాయలకే వైద్య సేవలు అందిస్తున్న వారు ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు యువ డాక్టర్లు సైతం పది రూపాయల వైద్యం వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ₹10 వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు తరువాత విజయవాడ నుంచి వెళ్లి కడపలో అదే పది రూపాయల వైద్యం అందించారు నూరీ పరీ అనే మహిళ డాక్టర్. అయితే రాష్ట్రంలో ఎటువంటి ప్రచారం లేకుండా పది రూపాయలకు వైద్యం అందించే డాక్టర్లు చాలామంది ఉన్నారు. పెద్దగా ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వని వైద్యులు మంచి సేవలు అందిస్తూ వచ్చారు. ఈ కోవలో తాజాగా చేరనున్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువ వైద్యురాలు. ఆమె పేరు డాక్టర్ ఎం లక్ష్మీ ప్రియ.
* ఉన్నత వైద్యురాలిగా
ఎన్టీఆర్ జిల్లా నందిగామ కు చెందిన లక్ష్మీ ప్రియ ఎంబిబిఎస్ పూర్తి చేశారు. గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఈ దసరా నుంచి పది రూపాయలకే వైద్యాన్ని ప్రారంభించనున్నారు. జనరల్ కేసులు, పీడియాట్రిక్ కేసులు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు, బిపి, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు తమను సంప్రదించవచ్చు అని చెబుతున్నారు ఆ యువ వైద్యురాలు.
* సోషల్ మీడియాలో వైరల్
నందిగామలో యువ వైద్యురాలు 10 రూపాయలకే సేవలు అందిస్తారని విస్తృత ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఇదే వైరల్ అవుతోంది. నందిగామ లోని ప్రభుత్వ ఆస్పిటల్ రోడ్ లోని యాదవుల బావి దగ్గర లతా క్లినిక్ పేరిట ఈ పది రూపాయల వైద్యం అందించేందుకు ఆమె సిద్ధపడుతున్నారు. దీంతో వందలాదిమంది అక్కడ వైద్య సేవలు పొందేందుకు సిద్ధపడుతున్నారు. ఆ యువ వైద్యురాలి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.