Visakhapatnam YCP: ఎందుకో విశాఖ వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీని పెద్దగా ఆదరించడం లేదు. ఆ పార్టీ నాయకత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన విశాఖలో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించినా అక్కడి ప్రజలు మాత్రం ఆహ్వానించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. 2014 ఎన్నికల్లో కేవలం మన్యంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపింది. 2019లో రూరల్ లో ప్రభావం చూపినా.. సిటీ విషయానికి వచ్చేసరికి మాత్రం జనాలు ఆదరించలేదు. ఈ ఎన్నికల్లో అయితే పూర్తిగా తిరస్కరించారు. మన్యంలో రెండే రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* గతంలో హేమాహేమీలు
విశాఖ జిల్లా నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు పనిచేశారు. ఆవిర్భావ సమయంలో సబ్బం హరి అండగా ఉండేవారు. అటు తరువాత కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు.. ఇలా చాలామంది సీనియర్లు అటువైపు మొగ్గు చూపారు. అయినా సరే ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. 2012 ఉప ఎన్నికల్లో మంచి విజయం దక్కించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మను ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపారు. అయినా ఆమెకు ఓటమి తప్పలేదు. అది మొదలు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ.. విశాఖ జిల్లాలో మాత్రం ఆ పార్టీకి కనీస స్థాయిలో కూడా పట్టు దొరకడం లేదు. గత ఐదు సంవత్సరాలు అధికార పార్టీగా గట్టిగానే ప్రయత్నం చేసింది వైయస్సార్ కాంగ్రెస్. కానీ ఎందుకో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది.
* గుడివాడ అమర్నాథ్ షిఫ్ట్
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లాలో దయనీయ పరిస్థితుల్లో ఉంది. జిల్లా పార్టీ పగ్గాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం విశాఖకు గుడివాడ అమర్నాథ్ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను మార్చి కొత్త వారికి ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరూ ముందుకు రావడం లేదు. దానికి ఓటమి సెంటిమెంట్ కారణం. వైసిపి ఆవిర్భవించిన మొదట్లో వంశీకృష్ణ శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో సీటు దక్కలేదు. త్రుటిలో మేయర్ పదవి దక్కకుండా పోయింది. మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబుది అదే సీన్. పెందుర్తి టిక్కెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆయనకు నాయకత్వం షాక్ ఇచ్చింది. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారు ఆయన. ఎన్నికల్లో పెందుర్తి నుంచి గెలిచారు. మరోవైపు వైసీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మల్ల విజయప్రసాద్ అనేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న అవంతి శ్రీనివాస్ సైతం ఓటమిచ్చావు చూసారు. ప్రస్తుత వైసిపి అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పలేదు.
* ఎవరికి వారుగా తప్పుకుంటున్న వైనం
ప్రస్తుతం చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులయ్యారు గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లాలో ఆ నియోజకవర్గ ఉండడంతో.. అధ్యక్ష పదవి నుంచి ఆయన మార్పు అనివార్యంగా మారింది. అయితే విశాఖ వైసిపి పగ్గాలు అందుకునేందుకు నేతలు ముందుకు రావడం లేదు. విశాఖ నాథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే రాజు పేరును కొందరు ప్రతిపాదించారు. కానీ ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. మల్ల విజయప్రసాద్ పరిస్థితి కూడా బాగాలేదు. మరోవైపు వాసుపల్లి గణేష్ కుమార్ పేరు వినిపించినా.. ఆయన వేరే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు బాధ్యతలు ఇస్తామంటే ఆయన సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రధానంగా ఓటమి సెంటిమెంట్ తోనే వారంతా బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.