https://oktelugu.com/

Congress: కాంగ్రెస్ క్యాడర్ లో కొత్త ఉత్సాహం

పీసీసీ చీఫ్ షర్మిల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఆమె నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పుడు ఆశావహులతో షర్మిల నేరుగా మాట్లాడుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 3, 2024 / 12:23 PM IST

    Congress

    Follow us on

    Congress: సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో అధికార వైసిపి దూకుడుగా ఉంది. దాదాపు తొమ్మిది జాబితాలను ప్రకటించి 80 మంది వరకు సిట్టింగ్లను మార్చింది. ఎంపీలను ఎమ్మెల్యేలుగా, మంత్రులను ఎంపీలుగా ఎంపిక చేసింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. అటు జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా.. పవన్ ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. దీంతో విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయానికి నేతల తాకిడి పెరగడం విశేషం.

    పీసీసీ చీఫ్ షర్మిల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఆమె నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పుడు ఆశావహులతో షర్మిల నేరుగా మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. బలమైన అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ లో ప్రజాబలం ఉన్న నేతలు చాలామంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో నియోజకవర్గాల్లో ప్రముఖ నేతలు ఎవరూ లేరు. కానీ ప్రతి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో సీనియర్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కొనసాగుతూ వచ్చారు. షర్మిల నాయకత్వ పగ్గాలు తీసుకోవడంతో వారంతా యాక్టివ్ అయ్యారు. అందుకే ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీతో పాటు తాము చేసిన ప్రజాసేవ ఇది అంటూ దరఖాస్తులో పేర్కొన్నారు. షర్మిల అందరితో మాట్లాడి వీలైనంత బలమైన నేతలను పోటీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

    ఏపీ కాంగ్రెస్ కార్యాలయం గా ఉన్న విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ గతంలో నిర్మానుష్యంగా కనిపించేది. షర్మిల పగ్గాలు తీసుకున్నాక రద్దీగా మారుతోంది. మీడియా తాకిడి కూడా అధికంగా ఉంది. నేతల కంటే కార్యకర్తలు ఎక్కువగా కార్యాలయానికి వస్తున్నారు. దీంతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. అటు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సైతం జరుగుతుండడంతో చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అటు విభజన హామీలపై డిక్లరేషన్ సభ నిర్వహించనున్నారు. అటు విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ముద్ర వేయడానికి జరుగుతున్న ప్రయత్నం ఆ పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.