AP Congress: ఏపీ పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పొత్తులతో బీజేపీ పట్టు బిగిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ సైతం ఒంటరిగా ఉనికి చాటుకునేలా విస్తరించాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. రాష్ట్ర విభజన హామీలతో పాటు రాజధాని అంశం, విశాఖ స్టీల్ ఉద్యమం వంటి వాటితో ఏపీ ప్రజలను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆదిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
పోయిన చోటే వెతుక్కోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీని ఏర్పాటు చేసి దారుణంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశారు. కాంగ్రెస్ పార్టీని ఉనికి లేకుండా చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైయస్ కుమార్తె షర్మిలను పార్టీలో చేర్చుకుంది. ఏపీ పగ్గాలు అందించింది. ఆమె గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. ఏకంగా సోదరుడు జగన్ పై పెద్ద యుద్ధమే ప్రకటించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వాలను ఏపీలో ప్రయోగించాలని చూడడం విశేషం.
అమరావతి రాజధానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలియజేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎన్నికలవేళ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన హామీల అమలుపై డిక్లరేషన్ ప్రకటించేందుకు ఈనెల 7న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరు కానున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన చరిత్ర డీకే శివకుమార్ ది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సైతం క్రియాశీలకంగా వ్యవహరించారు. అటువంటి నాయకుడు ఏపీపై దృష్టి పెట్టడం విశేషమే.
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏపీ పరిణామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. షర్మిల కు మద్దతుగా ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కాంగ్రెస్ పార్టీ బాహటంగా మద్దతు ప్రకటించింది. ఈనెల 11న విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్మికుల కు మద్దతుగా కాంగ్రెస్ ప్రకటన చేసేలా నిర్ణయించారు. సీఎం అయిన తర్వాత రేవంత్ తొలిసారిగా ఏపీకి రానున్నారు. ఆయన జాతీయస్థాయిలో బిజెపిని, రాష్ట్రస్థాయిలో వైసీపీని టార్గెట్ చేయనున్నారు. అదే సమయంలో చంద్రబాబు విషయంలో ఎలా స్పందిస్తారు అన్న దానిపై చర్చ జరుగుతోంది.