Nara Lokesh: నేపాల్( Nepal) అట్టుడికి పోతోంది. దేశవ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫాములపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఆ దేశ రాజధాని ఖాట్మండు వీధుల్లో ఘోరమైన ఘర్షణలు చెలరేగుతున్నాయి. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని ప్రజలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆర్మీ హెలిక్యాప్టర్ లో తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. ప్రధాని రాజీనామాను అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడేల్ ఆమోదించారు కూడా. అయినా సరే హింసాత్మక ఘటనలు నేపాల్ లో ఆగడం లేదు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే నేపాల్ లో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళవద్దని సూచిస్తుంది. నేపాల్ అధికారులతో పాటు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం నుంచి సలహాలు,సూచనలు పొందాలని కూడా చెబుతోంది. అలాగే ఏపీ ప్రభుత్వం తరఫున కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు మంత్రి నారా లోకేష్. సచివాలయానికి చేరుకొని ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచి నేపాల్ వెళ్లిన వారు ఎవరు? ఉద్యోగ ఉపాధి రీత్యా అక్కడ ఉన్నవారు ఎంతమంది? ఇలా అన్ని రకాల వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా వైద్యవృత్తి అభ్యసిస్తున్న విద్యార్థులు నేపాల్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
* అక్కడి భారత రాయబార కార్యాలయంలో
మరోవైపు ఖాట్మండులోని( khatmand) భారత రాయబార కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని సూచించింది.+977- 9808602881,+ 977- 9810326134. నేరుగా కానీ.. వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. నేపాల్ లో ఉన్న ఏపీ ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. అనంతపురంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక సభకు సైతం లోకేష్ వెళ్లడం లేదు. సచివాలయంలో ఉంటూ.. భారత ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నారు. నేపాల్ లో ఉన్న ఏపీ ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఏపీకి చెందిన 250 మందిని క్షేమంగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: ప్రజల కష్టాలే ముఖ్యం.. లోకేష్ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఇదీ
* ఎప్పటికప్పుడు సమన్వయం
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు నారా లోకేష్( Nara Lokesh ) ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఆర్టిజిఎస్ కేంద్రానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. అన్ని జిల్లాల యంత్రాంగాలతో మాట్లాడి ఎంతమంది నేపాల్ లో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. అలా వివరాలు దొరికిన వారితో నేరుగా ఫోన్లోనే మాట్లాడుతున్నారు నారా లోకేష్. ధైర్యంగా ఉండాలని, రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువస్తామని భరోసా ఇస్తున్నారు. నేపాల్ లో ఇప్పటి వరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం. వీరంతా నేపాల్ లో వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్ లోని బఫాల్, సిమిల్ కోట్, పశుపతి నగరం, పింగలస్థాన్ లో వీరంతా ఉన్నారని అధికారులు గుర్తించారు. అదే విషయాన్ని మంత్రి లోకేష్ కు వివరించారు. అయితే ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటున్నారు నారా లోకేష్. వారికి ఆహారం, భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒకసారి సమన్వయ పరుస్తున్నారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలోని ఏయే ప్రాంతాలకు చెందినవారు? వారి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లను అందుబాటులోకి ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు లోకేష్.
* మంత్రి నారా లోకేష్ నేపాల్ లో ఉన్న పలువురు తెలుగు వారితో నేరుగా ఫోన్లో మాట్లాడారు. విశాఖకు చెందిన సూర్య ప్రభతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి చిక్కుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నామని చెప్పారు.
* నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం +91 9818395787 నంబర్కు సంప్రదించవచ్చు. మరోవైపు 08632340678, వాట్సాప్ నంబర్ కు సంబంధించి +91 8500027678 అందుబాటులోకి ఉంచింది.
* ప్రస్తుతం నేపాల్ లో చిక్కుకున్న వారికి సంబంధించి గౌ శాలలో 90 మంది, పశుపతి నగరంలో 55 మంది, బఫాల్ లో 27 మంది, సిమిల్ కోట్ లో 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది.