Nellore Political Crisis: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీపై కుట్ర జరుగుతోందా? సొంత పార్టీ నేతలే పార్టీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? తమ స్వార్థం కోసం పార్టీని డామేజ్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ కామెంట్స్ చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయంలో అత్యంత చొరవ చూపారన్న విమర్శలు ఉన్నాయి. అయితే దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. ఎట్టి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు రాకూడదన్న కుట్రతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్రజల్లో చులకన కావడమే కాకుండా.. భవిష్యత్తులో వేమిరెడ్డి దంపతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా చేసిన కుట్రగా ఎక్కువమంది అభివర్ణిస్తున్నారు.
వేమిరెడ్డి తీరే వేరు..
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( vemireddy Prabhakar Reddy ) పారిశ్రామికవేత్త. సహజంగానే బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృదుస్వభావి. రాజకీయాలకు అతీతంగా అందరితో మంచిగా మెలుగుతారు. రాజకీయాలకు తగ్గట్టు అడుగులు వేస్తుంటారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీలో ఉండేవారు. 2019 నుంచి 2024 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఇప్పుడు టిడిపి వైపు వెళ్లారు. అంటే వచ్చే ఐదేళ్లలో జరిగే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఆయన అడుగులు వేసే అవకాశం ఉంది. ఆయనకు వ్యక్తిగత, రాజకీయ ఇష్టా ఇష్టాలు ఉండవు. అలాగని ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. అటువంటి నేత భార్యను కించపరుస్తూ వ్యాఖ్యానించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
Also Read: ఆ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్!
మాజీమంత్రి అనిల్ తీరుతో.. నెల్లూరులో( Nellore ) పెద్ద ఎత్తున నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారకుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సోలో పెర్ఫార్మెన్స్ చేయాలన్నది ఆయన అభిప్రాయం. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అనిల్ కుమార్ యాదవ్ ను క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉన్నా అనిల్ కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మరింతగా రెచ్చిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి పెద్ద మనిషిని కూడా గౌరవించలేదు. చాలా రకాలుగా తూలనాడుతూ మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ను వెనకేసుకొచ్చారు. అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి బలమైన అభ్యర్థి లేరు. లేనిపోని చెప్పుడు మాటలు చెప్పడంతో వేమిరెడ్డిని వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి. బలమైన నేతను నెల్లూరు పార్లమెంటు స్థానానికి స్వయంగా టిడిపికి అప్పగించారు. అప్పటికప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని బరిలో దించినా ఫలితం లేకపోయింది.
ఆ ప్రచారంతోనే వారు అప్రమత్తం..
వాస్తవానికి మరో ఐదేళ్లలో వేమిరెడ్డి దంపతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం ఖాయం అన్న ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారంతోనే ప్రసన్నకుమార్ రెడ్డి( Prasanna Kumar Reddy ) అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ వేమిరెడ్డి దంపతులు వైసీపీలోకి వస్తే తప్పకుండా వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే తన ఉనికికి ప్రమాదం అని ఆయన భావించారు. అందుకే ఉద్దేశపూర్వకంగానే ప్రశాంతి రెడ్డి పై ఆ వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపు అనిల్ కుమార్ యాదవ్ ప్రోత్సాహం కూడా ఉంది. వేమిరెడ్డి దంపతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణం అనిల్ యాదవ్. ఒకవేళ వారు తిరిగి వైసీపీలోకి వస్తే తనకు ఇబ్బంది తప్పదని అనిల్ భావించారు. అందుకే ఆ ఇద్దరు నేతలు పని గట్టుకుని అలా చేశారని నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇటువంటి వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కామెంట్స్ వినిపిస్తున్నాయి.