Nellore MLA Threat Letter: ఏపీలో ( Andhra Pradesh)ఇప్పుడు నెల్లూరు జిల్లా హాట్ టాపిక్ గా మారుతోంది. రాయలసీమలో కూడా చూడని విధంగా కొత్తగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా హత్య బెదిరింపులు వస్తుండడం సంచలనంగా మారుతోంది. జిల్లాలో మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని చంపేస్తామంటూ హెచ్చరికలు రావడం విశేషం. ఈనెల 17న ఒక వ్యక్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. అతడు ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి లేఖ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ లేఖను కార్యాలయ సిబ్బందికి అప్పగించారు భద్రతా సిబ్బంది. అయితే ఆ లేఖ తీసి చూడగా.. రూ.2 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే ప్రశాంతి రెడ్డిని చంపేస్తామంటూ రాసి ఉంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. జరిగిన విషయాన్ని ఎంపీ వేమిరెడ్డి దంపతులకు తెలియజేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: అప్పుడు వైసిపి.. ఇప్పుడు టిడిపి.. ఈ కిలేడి నీరా రాడియాను మించిన లాబియిస్టు!
ఇటీవల ఓ ఎమ్మెల్యే పై రెక్కీ
ఇటీవల కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి( Kavya Krishna Reddy) కూడా తన హత్యకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తన క్వారీ దగ్గర డ్రోన్ ఎగురవేసి తన కోసం రెక్కీ చేశారని ఆరోపించారు. కానీ చివరి నిమిషంలో కార్యక్రమాలు మార్చుకొని అమరావతి వెళ్లానని.. తనకోసం వచ్చిన ఇద్దరు యువకులను తమ అనుచరులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. ఈ కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కొద్ది రోజుల కిందట వివాదం..
కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి( Prashanti Reddy ), మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య వివాదం నడిచింది. ప్రశాంతి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ తరుణంలో ప్రసన్న కుమార్ ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది జిల్లా రాజకీయాల్లో అలజడి రేపింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్న తరుణంలో ఏకంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి బెదిరింపు లేఖ రావడం విశేషం. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. కేసును సీరియస్గా తీసుకున్నారు. ఓ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద 4 మొబైల్ ఫోన్లు లభించడంతో అనుమానాలు బలపడుతున్నాయి. అయితే దీనిపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు.
Also Read: నో అడ్మిషన్ బోర్డు.. ఇంత మంచి ప్రభుత్వ స్కూలు ఎక్కడుంది? ఏంటా కథ?
నెల్లూరులో భిన్న రాజకీయాలు..
ఏపీలో నెల్లూరు( Nellore ) రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఎక్కువ. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధి క్యత సాధించింది. 2019 ఎన్నికల్లో అయితే క్లీన్ స్లీప్ చేసింది. అయితే 2024 ఎన్నికల్లో మొత్తం సీన్ రివర్స్ అయింది. దీంతో అక్కడ వైసిపి ఓడిపోవడానికి వేమిరెడ్డి దంపతులు కారణమని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకే ఆ దంపతులను టార్గెట్ చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి చక్క దిద్దుకున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడం మాత్రం సంచలనంగా మారింది.