Lokam Madhavi: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆఫిడవిట్లలో ఆస్తులతో పాటు అప్పుల వివరాలు పొందుపరుస్తున్నారు. తమపై నమోదైన కేసులు, వాటి పురోగతిని పేర్కొంటున్నారు.ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లకు సంబంధించి.. కోవూరు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆస్తుల్లో ప్రథమ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి లోకం మాధవి వచ్చి చేరారు. వేంరెడ్డి దంపతుల కంటే అత్యధిక ఆస్తులను తన అఫీడవిట్లో చూపించారు. ఈమె విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఆఫిడవిట్లో తన ఆస్తుల విలువను రూ.894.92 గా చూపించడం విశేషం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఆమెపై పడింది. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని ఎక్కువ మంది ఆరా తీయడం కనిపిస్తోంది.
లోకం మాధవి ఉన్నత విద్యాభ్యసించి విదేశాల్లో ఉద్యోగం చేశారు. ఆమె భర్త లోకం ప్రసాద్ తో కలిసి మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఈ కంపెనీ మంచి లాభాలు ఆర్జించింది. దీంతో ఏపీవ్యాప్తంగా మిరాకిల్ సంస్థలు విస్తరించారు. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని ముంజేరులో మిరాకిల్ కంపెనీ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను ఏర్పాటు చేశారు. విశాఖలోనూ క్యాంపస్ కొనసాగుతోంది. అమెరికా కస్టమర్లకు ఇక్కడి నుంచే సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్నారు. భోగాపురం ప్రాంతంలో విద్యాసంస్థలను సైతం నెలకొల్పారు. భోగాపురం లో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనకు ముందే విస్తృతంగా విద్యాసంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లోకం మాధవికి టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. వారు సైతం టికెట్ పై ఆశలు పెంచుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అందరూ విద్యాసంస్థల అధినేత గానే లోకం మాధవిని చూశారు. కానీ ఆఫిడవిట్లో ఆమె ఆస్తుల వివరాలను ప్రకటించేసరికి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే జనసేనలో ఈ స్థాయిలో ఆర్థిక శ్రీమంతులు కనిపించడం లేదు. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లకు సంబంధించి.. ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్న అభ్యర్థుల్లో లోకం మాధవి ముందంజలో ఉండడం విశేషం.