Narayana Swamy House Raid: ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam )ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్యులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారు కటకటాల పాలయ్యారు. వారికి బెయిల్ సైతం దొరకడం లేదు. మరోవైపు ఇప్పటివరకు ఈ కేసులో రెండు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అందులో అంతిమ లబ్ధిదారుడు గురించి పరోక్ష ప్రస్తావన చేసింది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించింది. అయితే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ నిర్వర్తించిన ఓ నేత అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు తాజాగా ఆయన చుట్టూ జరుగుతున్న పరిణామం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం.
Also Read: ఏపీలో మద్యం కుంభకోణం.. ఎక్సైజ్ మంత్రికి సంబంధం లేదట!
అప్పట్లో ఎక్సైజ్ మంత్రిగా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఎక్సైజ్ శాఖామంత్రిగా పనిచేశారు నారాయణస్వామి. మద్యం కుంభకోణం కేసు విచారణలో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలతో తాను విచారణకు రాలేకపోతున్నానని ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం అందించారు నారాయణస్వామి. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రమేయం లేకుండానే నూతన మద్యం పాలసీని రూపొందించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన పాత్ర పై దర్యాప్తులో తేలలేదని సమాచారం. దీనికి కారణంగానే మద్యం కుంభకోణం కేసులో సాక్షిగానే నారాయణస్వామి స్టేట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం నడిచింది. అందులో భాగంగానే ఆయనకు నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.
Also Read: పవన్ ను తిట్టబోయి జగన్ గురించి నోరు జారి అడ్డంగా బుక్కైన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్
కొనసాగుతున్న తనిఖీలు..
అయితే ఈరోజు ఉన్న ఫలంగా నారాయణస్వామి( Narayana Swamy ) ఇంటికి నేరుగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు రావడం సంచలనంగా మారుతోంది. అయితే నారాయణస్వామిని అరెస్టు చేస్తారా? లేకుంటే విచారణతో సరిపెడతారా అని ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం నారాయణ స్వామి ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి ఏవన్ గా ఉన్నారు. మరో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. అందులో 12 మంది అరెస్టు అయ్యారు. మిగతావారు పరారీలో ఉన్నారు. రెండుసార్లు కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేసింది సిట్. ఇటువంటి పరిస్థితుల్లో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి ఇంట్లో తనిఖీలు జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.