Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: రాజకీయాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు కాదు.. పరిణతి, పరిజ్ఞానం, వివేకం.. లోకేష్ 2.0...

Nara Lokesh: రాజకీయాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు కాదు.. పరిణతి, పరిజ్ఞానం, వివేకం.. లోకేష్ 2.0 ద్వారా ఏం చెబుతున్నారంటే..

Nara Lokesh: వాడిని వీడు తిట్టడం.. వీడిని వాడు తిట్టడం.. విమర్శలు చేసుకోవడం.. ప్రతి విమర్శలకు ఏమాత్రం వెనకాడకపోవడం.. టన్నులకొద్దీ బురద చల్లుకోవడం.. చివరికి కుటుంబ సభ్యులను కూడా వదలకపోవడం.. ఇలానే తయారయ్యాయి రాజకీయాలు.. అందువల్లే వెనకటికి పరుచూరి సోదరులు రాసిన “స్మశానం ముందు ముగ్గు ఉండదు.. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు..” అనే మాట పదేపదే జ్ఞప్తికి వస్తుందంటే తప్పు ఎవరి వల్ల జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనుకుంటా.

బూతులతో నిండిన రాజకీయాలు.. కుళ్ళు తో నిండిన రాజకీయాలు.. కుతంత్రాలతో నిండిన రాజకీయాలు.. మారవా.. ఇకపై మారే అవకాశం లేదా.. రాజకీయ నాయకులకు పరిణతి రాదా.. విజ్ఞానాన్ని, వివేకాన్ని, వివేచనను ప్రదర్శించే రాజకీయ నాయకులను మనం చూడలేమా? ఈ ప్రశ్నలకు నేను ఉన్నా.. నేను మొదలుపెడతా.. అరే తీరుగా సమాధానం చెబుతున్నారు ఏపీ మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఎన్నికలు ముగిశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విజయవంతంగా పరిపాలన సాగిస్తోంది. మరి ఇలాంటి సమయంలో నారా లోకేష్ ప్రస్తావన ఎందుకూ అంటే.. ఆగండి ఆగండి అక్కడిదాకే వస్తున్నాం. “అద్భుతాలు జరిగినప్పుడు ఎవరూ గుర్తించరు.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు” ఇప్పుడు ఏపీ రాజకీయాలలో నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నం కచ్చితంగా అద్భుతమే. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. పట్టించుకోవాల్సిన సందర్భం కూడా ఉంది.. నారా లోకేష్ ఏపీ మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గాడి తప్పిన విద్యా వ్యవస్థను ఒక మార్గంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల కోసం ఏకంగా జీవోలనే మార్చేశారు. చివరికి ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు కోల్పోకుండా ఉండేందుకు నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. చివరికి విద్యార్థుల భవిష్యత్తు కలల సౌధాన్ని కళ్ళ ముందు ఉంచారు. సహజంగా ఇలాంటి ప్రయత్నం ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకంటే ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు గతంలో లేవు.. అందుకే ఒక రాజకీయ నాయకుడు విద్యావేత్త అయితే ఫలితాలు ఎలా ఉంటాయో నారా లోకేష్ నిజం చేసి చూపించారు.

ఒక రాజకీయ నాయకుడికి అంశాల మీద పట్టు ఉండాలి. ప్రజా సమస్యల మీద అవగాహన ఉండాలి. వాటన్నింటికి నుంచి రాజకీయ చతురత ఉండాలి. ఇలాంటప్పుడే ఆ రాజకీయ నాయకుడు లోని అసలు కోణం ప్రజల్లోకి వెళ్తుంది. అలాంటి సందర్భం నారా లోకేష్ నుంచి ఆవిష్కృతమైంది. ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు నారా లోకేష్ ను ఇంటర్వ్యూ చేశాయి. ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. సహజంగానే ఒక రాజకీయ నాయకుడికి చిరాకు పెట్టే ప్రశ్నలు వేయడానికి పాత్రికేయులు ఎప్పుడూ ముందుంటారు.. దానికి జాతీయ మీడియా మినహాయింపు కాదు.. ప్రఖ్యాత ఎన్డిటీవీ, టైమ్స్ నౌ వంటి చానల్స్ రాహుల్ గాంధీ.. అఖిలేష్ యాదవ్ ను ఉద్దేశించి ప్రశ్నలు అడిగితే.. దానికి లోకేష్ వ్యూహ చతురతతో కూడిన సమాధానాలు ఇచ్చారు.” రాహుల్ గాంధీని పాదయాత్ర మార్చింది. దానిని నిన్ను నమ్ముతున్నాను. ఆయనలో నేను కొన్ని అంగీకరించని విధానాలు కూడా ఉన్నాయి.. భారత్ అంటే సంక్షేమ మాత్రమే కాదు. సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉంది. వారిది స్థాయి దాటిపోయిన సంక్షేమం.. అలాంటప్పుడు హామీలు ఇచ్చే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.. రాహుల్ గాంధీకి దేశాన్ని నడిపించే సామర్థ్యం ఉందా? లేదా? అనే ప్రశ్నలకు కాలం సమాధానం చెబుతుంది.. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అఖిలేష్ యాదవ్ ఎంతో కొంత మేలు చేశారు. ఆయన తదుపరికాలానికి ముఖ్యమంత్రి అవుతారా? ప్రతిపక్షానికి పరిమితం అవుతారా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది. మమతా బెనర్జీ అంటే నాకు గౌరవం. ఒక స్త్రీ మూర్తిగా ఆమెను గౌరవిస్తాను. కాకపోతే ఇటీవల బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు ఒకింత ఆమెకు కష్టకాలం.. త్వరలోనే వాటి నుంచి ఆమె బయటపడతారని నమ్మకం ఉందని” నారా లోకేష్ పేర్కొన్నారు.

ప్రస్తుతం నారా లోకేష్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. జాతీయ మీడియా ప్రముఖంగా ఇండియా కూటమిలోని నాయకుల లోపాలను ప్రశ్నిస్తూ లోకేష్ ఎదుట ప్రశ్నలు సంధించింది. దీనికి నారా లోకేష్ ఒక రాజకీయ నాయకుడిలాగా స్పందించలేదు. ఆకాశం దొరికింది కదా అని విమర్శలు చేయలేదు. ఒక హుందాతనాన్ని ప్రదర్శించారు. నేర్పరితనాన్ని అవలంబించారు. అందువల్లే జాతీయ మీడియా సైతం ఆయనకు సలాం చేసింది. ఇక చివరిగా నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి ప్రశ్న ఎదురైనప్పుడు.. లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు..” అది నాకు కష్టకాలం. మా కుటుంబానికి విచారకరమైన సమయం. పార్టీ కూడా ఇబ్బంది పడే సందర్భం. అలాంటి సమయంలో మాకు దేశం నుంచి స్పందన లభించింది. హైదరాబాదులో ప్రజలు కృతజ్ఞతలు చూపించారు. వేలాది మంది ఐటి ఉద్యోగులు ఆయనకు బాసటగా నిలిచారు. చివరికి న్యాయం గెలిచింది. జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని చూసిన తర్వాత నేను జీర్ణించుకోలేకపోయాను. అంతకుముందు నేను ఎప్పుడు ఎవరినీ జైల్లో వెళ్లి కలవలేదు. తొలిసారి చంద్రబాబును జైల్లో కలిశాను.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాజమండ్రి జైలును అభివృద్ధి చేశారు. ఆయనను కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడి అధికారులు ఆ విషయాన్ని చెప్పారు. ఇక ప్రతీకార రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. ప్రజలు మాకు ఓటు వేసింది ప్రతీకారం తీర్చుకోమని కాదు.. రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలని.. అదే విధానాన్ని మీకు కొనసాగిస్తాం. రెడ్ బుక్ ట్రాప్ లో ప్రతిపక్షాలు ఉన్నాయి. తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదని” లోకేష్ వ్యాఖ్యానించడం పార్టీ వర్గాల్లో భరోసా నింపుతోంది. మొత్తంగా పాదయాత్ర ద్వారా మరింత పరిపక్వత సాధించిన నారా లోకేష్ 2.0 ను పార్టీ భవిష్యత్తు ఆశాకిరణం లాగా ఆవిర్భవించేలా చేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version