nara lokesh (4)
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నారు. ఇక మీదట విద్యార్థులపై విద్యాభారం తగ్గించి, వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పాటునందించే లక్ష్యంతో ఆయన ‘నో బ్యాగ్ డే’ అనే వినూత్న కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు. 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఇక మీదట ప్రతి శనివారం పాఠశాలలకు బ్యాగులు తీసుకు రావాల్సిన అవసరం లేదు. విద్యార్థులపై ఉన్న విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించాలనే సంకల్పంతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.. అదే సమయంలో, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం పాఠ్యేతర కార్యకలాపాలు, విభిన్న అభ్యసన విధానాలను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
Also Read: సిపిఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ.2300 కోట్లు
నారా లోకేష్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ నో బ్యాగ్ డేలో విద్యార్థుల కోసం అనేక ఆసక్తిక కార్యకలాపాలను రూపొందించారు. వాటిలో క్విజ్‌లు, సెమినార్లు, డిబేట్స్, క్రీడా పోటీల ద్వారా విద్యార్థులలో క్రియేటివిటి, గ్రూప్ ఇంటర్వ్యూ, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళికలో వృత్తి శిక్షణ, లలిత కళలు, నాయకత్వ కార్యక్రమాలను చేర్చాలనే మంత్రి లోకేష్ విజన్‌తో అనుభవపూర్వక అభ్యసనకు ప్రాధాన్యతను పెంపొందించనున్నారు.
“ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్” అనే మహోన్నత లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలపాలని మంత్రి నారా లోకేష్ ధృడ నిర్ణయంతో ఉన్నారు. పాఠశాల విద్యలో ఆయన చేపట్టిన సంస్కరణలు ఇప్పటికే ఆశాజనకమైన ఫలితాలను అందిస్తున్నాయి. ఆయన ఆరు నెలల సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా రూపొందించబడిన ఈ నో బ్యాగ్ డే కార్యక్రమం స్కిల్ టెస్టులు, క్లబ్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పెల్ బీ కాంపిటేషన్, లలిత కళలు, వృత్తి విద్య, వినోద క్రీడలు, ఆర్ట్స్, మోడల్ పార్లమెంట్ మీటింగ్స్ మరెన్నో కార్యకలాపాల ద్వారా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి ఉద్దేశించారు.
మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ప్రతి ‘నో బ్యాగ్ డే’ను లెర్నింగ్ ను బలోపేతం చేయడానికి.. వారం పాఠాలపై విద్యార్థుల అవగాహనను అంచనా వేయడానికి ఒక చిన్న మూల్యాంకనం నిర్వహిస్తారు. విద్యార్థుల్లోని క్రియేటివిటీని వెలికితీసేందుకు డ్రాయింగ్, క్లే మోడలింగ్, తోటపని వంటి కార్యకలాపాలు ఉంటాయి. వృత్తి విద్య ద్వారా విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్యం లభిస్తుంది.మోడల్ పార్లమెంట్ సమావేశాలు విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి సహాయపడతాయి.
గత ప్రభుత్వం తప్పుడు విధానాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి లక్షలాది మంది విద్యార్థులు తప్పుకున్నారని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డ్రాప్ అవుట్ సమస్యను అధిగమించడానికి, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ఆయన ఈ ‘నో బ్యాగ్ డే’ వంటి వినూత్న కార్యక్రమాలను ముందుకు తెస్తున్నారు.