Nara Lokesh : నారా లోకేష్ ను( Nara Lokesh) ప్రమోట్ చేసే సమయం ఆసన్నం అయిందా? ఇందుకు మహానాడు వేదిక కానుందా? పదోన్నతి తప్పదా? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిని చేస్తారా? లేక ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారా? పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడు జరగనుంది. ఈ సమావేశాల్లో పలు తీర్మానాలు చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. అయితే 75 వసంతాలు పూర్తి చేసుకున్న చంద్రబాబు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని.. లోకేష్ కు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది మాట. నారా లోకేష్ ఇప్పటికే ప్రభుత్వంతోపాటు పార్టీలో పట్టు సాధించారు. అందుకే ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
Also Read : 22 వంటకాలతో ‘మహానాడు’ మెనూ వైరల్!
* 2009 నుంచి సేవలు..
విదేశాల్లో చదువుకున్న నారా లోకేష్ 2009 నుంచి పార్టీకి వెనుక ఉండి సేవలు అందిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. టిడిపి( Telugu Desam Party) విజయం సాధించడంతో చంద్రబాబు లోకేష్ ను ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తరువాత ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే తప్పిదం జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పరోక్షంగా రాజకీయాల్లోకి తెచ్చి అనవసరంగా విపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించారు. అయితే లోకేష్ ను ప్రత్యర్థులు టార్గెట్ చేసుకున్న విధంగా.. దేశంలో మరో వారసుడికి ఈ పరిస్థితి ఎదురు కాలేదు. అయినా సరే తనను తాను ప్రూవ్ చేసుకున్నారు లోకేష్. సరికొత్త విధంగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.
* ఎన్నో కష్టాలను అధిగమించి..
2019 నుంచి 2024 మధ్య వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పాలనలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు నారా లోకేష్. ఒకానొక దశలో లోకేష్ నాయకత్వంపై సొంత పార్టీ శ్రేణులకి నమ్మకం లేదు. అటువంటి సమయంలో తనలో ఉన్న నాయకత్వ పటిమను బయటపెట్టారు. బలమైన నాయకుడిగా నిరూపించుకున్నారు. ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించగలిగారు. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. రాజకీయాలు పనికిరాడు అన్న వారితోనే జై కొట్టించుకున్నారు. తండ్రి చంద్రబాబు కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉంటే.. లోకేష్ పడిన తపన అంతా ఇంతా కాదు. ఒక వైపు పార్టీని కాపాడుకుంటూనే.. ఇంకో వైపు తండ్రి అక్రమ అరెస్టులపై గట్టిగానే పోరాటం చేశారు. జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ.. కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపడంలోనూ.. లోకేష్ పరిణితి సాధించారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి గెలుపులో కీలక భూమిక పోషించారు.
* ఏదో పదవి ఖాయం..
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో శ్రమపడిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు లోకేష్. జూనియర్లతో పాటు సీనియర్లను సమన్వయం చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నారా లోకేష్ ను ప్రమోట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎక్కువమంది భావిస్తున్నారు. చంద్రబాబు వయసు రీత్యా 8 పదులకు దగ్గరవుతున్నారు. ఇటువంటి క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ.. ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా కానీ.. లేకుంటే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కానీ అవకాశం ఇస్తారని అంతటా ప్రచారం జరుగుతోంది. మహానాడు వేదికగా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.