Nara Lokesh meets Tata Chairman: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ప్రభుత్వ పెద్దలు గట్టిగానే పనిచేస్తున్నారు. సీఎంగా చంద్రబాబు( CM Chandrababu), డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఉన్నారు. అయితే ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. రాజకీయపరమైన అంశాలు తెరపైకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనను సజావుగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో నారా లోకేష్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. దీంతో నారా లోకేష్ పరిశ్రమలతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. అయితే నవంబర్లో విశాఖలో జరిగే పారిశ్రామిక సదస్సుకు.. విదేశీ పారిశ్రామికవేత్తలతో పాటు స్వదేశీ పెట్టుబడిదారులను తీసుకొచ్చేందుకు ప్రయత్నంలో ఉన్నారు లోకేష్. ఆయన కృషితో ఇప్పటికే విశాఖకు వచ్చేందుకు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు సిద్ధమయ్యాయి. కొద్ది నెలల్లోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.
పెట్టుబడుల సదస్సు గొప్ప ఆలోచన..
సాధారణంగా ప్రతి ప్రభుత్వానికి పెట్టుబడులు తీసుకురావాలన్న ఆలోచన ఉంటుంది. దిగ్గజ సంస్థలను సంప్రదిస్తాయి కూడా. అయితే పారిశ్రామికవేత్తలు ఎప్పుడు దొరకరు. వారికి అంత తీరుబాటు కూడా ఉండదు. నిత్యం తమ సంస్థల పనుల్లో బిజీగా ఉంటారు. అటువంటి వారిని ఒకచోట చేర్చేందుకు పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేయడం అనేది గొప్ప ఆలోచన. జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) విఫలమయింది అక్కడే. ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను రప్పించుకున్నారు కానీ.. వారితో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించలేదు. ఒప్పందాలు కూడా చేసుకోలేదు. జగన్ మైనస్ ను ఇప్పుడు లోకేష్ ప్లస్ చేసుకుంటున్నారు. పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేసి నేరుగా వారితో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు. తద్వారా తమ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక ఉత్పత్తులు ప్రారంభమయ్యేలా చూడాలని భావిస్తున్నారు.
ఆ క్రెడిట్ కోసం ఆరాటం..
ఏదైనా ప్రభుత్వానికి ఐదేళ్లు మాత్రమే కాలపరిమితి ఉంటుంది. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో తదుపరి ప్రభుత్వం లాభపడ్డ సందర్భాలు ఇవి. అందుకే లోకేష్ ( Minister Nara Lokesh)మాత్రం తమ ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు చేసుకొని.. తమ ప్రభుత్వ హయాంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి.. తమ ప్రభుత్వ హయాంలోనే ఉత్పత్తులు ప్రారంభించాలన్న కృతనిశ్చయంతో పని చేస్తున్నారు. వాస్తవానికి లోకేష్ ఐటీ శాఖ మంత్రి. పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ అన్నారు. కానీ పరిశ్రమలను రప్పించేందుకు లోకేష్ తపన పడుతున్నారు. తద్వారా రాజకీయంగాను బలపడాలని చూస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో రాజీ పడడం లేదు. తన శక్తి యుక్తులను వినియోగించుకుంటున్నారు.