Pawan Kalyan unhappy: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) మౌనం దేనికి సంకేతం? ఆయన సైలెంట్ గా ఎందుకు ఉన్నారు? జ్వరంతో బాధపడుతున్నారా? లేకుంటే కారణం ఇంకేదైనా ఉందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో దీనిపై చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట విజయవాడలో ఆటో డ్రైవర్ల పథకానికి సంబంధించి కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముభావంగా కనిపించారు. అది మొదలు సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చ ప్రారంభం అయింది. చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రశంసలు కురిపిస్తున్నా పవన్ స్పందించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతుండడంతోనే అలా ముభావంగా ఉండిపోయారన్న టాక్ వినిపించింది. కానీ తెర వెనుక ఇటీవల జరుగుతున్న పరిణామాలు కారణమని తెలుస్తోంది.
బాలకృష్ణ వ్యాఖ్యలపై..
అసెంబ్లీలో బాలకృష్ణ( Nandamuri Balakrishna) వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పరామర్శించారు చంద్రబాబు. జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. అయితే అంతవరకు ఓకే కానీ.. నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను తీవ్ర మనస్థాపానికి గురిచేసాయని బయట ప్రచారం నడుస్తోంది. వివాదం జరిగిన తరువాత బాలకృష్ణతో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేకపోయారని.. దానిపైనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా బాధపడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఇది ముగిసిన అధ్యయనమని.. వైసిపి పెద్దది చేసిందన్న అనుమానం కూటమినేతల్లో ఉంది. పవన్ కళ్యాణ్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
పిఠాపురం పరిణామాలు..
మరోవైపు పిఠాపురంలో( Pithapuram) జరుగుతున్న పరిణామాలు పవన్ కళ్యాణ్ లో ఎక్కువగా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది. పిఠాపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మారింది. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్రను తెలుగుదేశం పార్టీ పోసిస్తోంది. ముఖ్యంగా అక్కడ జనసేనకు వర్మ అనుచరులు ఇబ్బందికరంగా మారారు. ఆపై వర్మకు గన్మెన్లు కేటాయించడం కొత్త వివాదానికి దారితీసింది. గత కొంతకాలంగా అసంతృప్తితో వర్మ ఉన్నట్లు ప్రచారం నడిచింది. త్వరలో ఆయనకు నామినేటెడ్ పదవి దక్కుతుందని కూడా టాక్ నడిచింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయనకు భద్రత కల్పిస్తూ గన్మెన్లు కేటాయించడం పై జనసేన వర్గాలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కొట్టి పారేస్తున్న జనసేన వర్గాలు..
అయితే జనసేన వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా ఫీవర్ తో బాధపడుతున్నారని.. చంద్రబాబుతో పాటు లోకేష్ రిక్వెస్ట్ చేయడం వల్లే ఆటో డ్రైవర్ల పథకం కార్యక్రమానికి హాజరయ్యారని చెబుతున్నారు. పిఠాపురం విషయంలో పవన్ కళ్యాణ్ తో ఆలోచించి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని… ప్రధానంగా ఇసుక, మట్టి మాఫియా పై వర్మ తరచు వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారి నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని తెలిసి భద్రత కల్పించారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదని తేల్చి చెబుతున్నాయి జనసేన వర్గాలు. మరి ఇందులో ఏది వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.