Nara lokesh: ఏపీలో విశాఖ నగర ప్రాధాన్యం వేరు. రాష్ట్ర విభజన తర్వాత అందరి కళ్ళు విశాఖపై పడ్డాయి. ప్రశాంత నగరం.. ఆపై పచ్చని తివాచీ పరిచినట్లు ఉంటుంది. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందింది. గత వైసిపి ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించింది. అయినా సరే విశాఖ నగరవాసులు పెద్దగా ఆహ్వానించలేదు. వైసీపీకి ఆదరించలేదు. దీనిని బట్టి వారు ప్రశాంతతను కోరుకుంటున్నారు అని అర్థమైంది. అందుకే కూటమి ప్రభుత్వం ఎటువంటి హడావిడి చేయడం లేదు. విశాఖ నగర ప్రశాంతతకు భంగం వాటిల్లే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఈ తరుణంలోనే మంత్రి లోకేష్ విశాఖఫై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం విశేషం. ప్రస్తుతం విశాఖ జిల్లాకు మంత్రి లేరు. ఉన్నది అనకాపల్లి జిల్లా నుంచి. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోం శాఖను నిర్వర్తిస్తున్నారు. అయితే విశాఖ నగరానికి మంత్రి లేరు అన్న లోటు తెలియకుండా లోకేష్ నెలలో.. రెండు మూడు రోజులపాటు విశాఖలోనే గడుపుతున్నారు. పార్టీ కార్యాలయంలోనే ఉంటున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. పార్టీ శ్రేణులతో సైతం సమావేశాలు నిర్వహిస్తున్నారు.
* వైసిపి హయాంలో సైతం
వైసిపి ప్రభుత్వ హయాంలో సైతం విశాఖ నగరానికి మంత్రి లేరు. అప్పట్లో అనకాపల్లి జిల్లాకు రెండు మంత్రి పదవులు కేటాయించారు జగన్. తొలిమంత్రి వర్గంలో అవంతి శ్రీనివాసరావుకు చాన్స్ ఇచ్చారు. విస్తరణలు ఆయన పదవిని తీసేశారు. అప్పట్లో విపక్షమైన తెలుగుదేశం పార్టీ మంత్రి లేక పోవడాన్ని ఆక్షేపించింది. ఇప్పుడు టిడిపి సైతం అనకాపల్లి జిల్లాకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చింది. విశాఖ జిల్లాకు మంత్రివర్గంలో ఎటువంటి ప్రాధాన్యత లేదు. దీనిపై విమర్శలు రావడంతోనే లోకేష్ తరచూ విశాఖపట్నం వెళ్తున్నారు. అయితే ప్రత్యేక వ్యూహంతోనే లోకేష్ విశాఖకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
* ఆ నగరాలతో సమానంగా
ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయవాడ- గుంటూరు నగరాలపై తప్పకుండా ఈ ప్రభావం ఉంటుంది. అయితే మరో అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ ఉంది. వైసిపి పాలన రాజధానిగా ఎంపిక చేసింది. ఇప్పుడు ఎంత మాత్రం నిర్లక్ష్యం చేసినా అది వైసీపీకి ప్రచార అస్త్రంగా మారుతుంది. అందుకే టిడిపి కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. అమరావతి, గుంటూరు,విజయవాడ తో పాటు విశాఖ పై సైతం దృష్టి పెట్టినట్లు చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తరచూ లోకేష్ పర్యటన అని తెలుస్తోంది.
* ముందు జాగ్రత్తల్లో భాగమా
గత వైసిపి పాలనలో విశాఖలో భారీగా భూదందాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు భారీగా భూములు కబ్జా చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. వైసీపీ నేతల హడావిడి చూసి విశాఖ నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. మరోసారి ఆ పరిస్థితి ఉండకూడదని టిడిపి నాయకత్వం భావిస్తోంది. అందుకే మంత్రి లోకేష్ తరచూ విశాఖలో పర్యటనలు చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మొత్తానికైతే లోకేష్ విశాఖను ఓన్ చేసుకోవడం.. సొంత పార్టీ నేతలకు సైతం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యర్ధుల్లో సైతం భయం రేకెత్తిస్తోంది.