Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు తరచూ చెప్పుకొస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఛాన్స్ ఇచ్చారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యవహరించాలని.. ప్రజా వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు వద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులతో పార్టీకి దూరమయ్యారు.మరో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు సైతం అభ్యంతరకరంగా ఉంది. తరచూ ఆయన వివాదాస్పదం అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏకంగా వైసీపీ నేత ఇంటి నిర్మాణాన్ని దగ్గరుండి తొలగించారు. డ్వాక్రా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని పోలీస్ స్టేషన్లో ఉంచేలా ఆదేశాలు ఇచ్చారు. సొంత పార్టీ సర్పంచ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. దీంతో మనస్థాపానికి గురైన సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటన. అయితే తాజాగా తిరుపూరు నియోజకవర్గ టిడిపి శ్రేణులు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసుని కలిశాయి. ఎమ్మెల్యే వ్యవహార శైలి పై ఫిర్యాదు చేశారు. తక్షణం అక్కడ టిడిపికి ఇన్చార్జిని నియమించాలని కోరారు. దీంతో హై కమాండ్ కు మరో తలనొప్పి ప్రారంభం అయినట్టుంది.
* అమరావతి ఉద్యమ నేతగా గుర్తింపు
అమరావతి ఉద్యమనేతగా కొలికపూడి శ్రీనివాసరావుకు మంచి పేరు ఉంది. మంచి వక్త కూడా. అయితే అంతకుమించి ఆవేశపరుడన్న ముద్ర ఉంది. గతంలో ఓ టీవీ డిబేట్లో ఆయన వ్యవహార శైలి హాట్ టాపిక్ అయ్యింది. టిడిపి అనుకూల మీడియా ఛానల్ అధినేత సిఫారసు మేరకు ఆయనకు చివరి నిమిషంలో టికెట్ లభించింది. అయితే ఆయన వ్యవహార శైలి పై టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికల ముందు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కూడా అదే పరంపరను కొనసాగిస్తున్నారు. ఒకటి రెండుసార్లు చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. కానీ ఆయన వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేదు.
* టిడిపిలో చర్చ
కొలికపూడి పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏం చేయాలో హై కమాండ్ కు పాలు పోవడం లేదు. ఒకవేళ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే.. న్యూసెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అనుమానం పడుతోంది హై కమాండ్. ఎన్నికలకు ముందు ఇదే తరహాలో టిడిపి హై కమాండ్ కొందరిని ప్రోత్సహించింది. వివిధ సమీకరణలో భాగంగా వారికి టిక్కెట్లు లభించలేదు. దీంతో వారు పార్టీకి వ్యతిరేకులుగా మారారు. ప్రత్యర్థులకు మించి విమర్శలు చేస్తున్నారు.
* ఇన్చార్జిని నియమించాలని డిమాండ్
అయితే ఇప్పుడు నియోజకవర్గ పార్టీ శ్రేణులు నేరుగా వచ్చి పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఉండగా ఇన్చార్జి నియమించాలని వారు కోరుతున్నారు. అప్పుడే అక్కడ పార్టీ బలపడుతుందని.. లేకుంటే సర్వనాశనం కావడం ఖాయమని వారు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఇష్టాను రీతిలో నోరు పారేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థానంలో ఇంచార్జ్ను నియమించాలని పట్టుబడుతున్నారు. దీంతో టిడిపి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.