Nara Lokesh : లోకేష్ ( Nara Lokesh )ప్రమోషన్ ఖాయమా? టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారా? ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. త్వరలో టిడిపి మహానాడు జరగనుంది. అంతకుముందే భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రం తో పాటు జాతీయ వర్గాలను సైతం మార్చే పనిలో ఉన్నారు. పనిలో పనిగా పొలిట్ బ్యూరోలో సైతం మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ ను సైతం ప్రమోట్ చేసే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తేనే.. నాయకుడిగా ఇతర పార్టీలు గౌరవించే అవకాశం ఉంది. లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమని చంద్రబాబుకు తెలుసు.
* పార్టీపై పట్టు
లోకేష్( Lokesh) పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు సాధించారు. తిరుగులేని శక్తిగా మారారు. ఆయనకు ఎదురు చెప్పే.. ఎదురు నిలిచే నేత ఎవరూ కనిపించడం లేదు. పైగా పార్టీ అధికారంలో ఉంది. జాతీయ స్థాయిలో సైతం సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. అందుకే ఇది కరెక్ట్ సమయమని చంద్రబాబు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్లు సైతం ఇదే సూచన చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా పర్వాలేదు.. పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన పర్వాలేదు అని చెప్పుకొస్తున్నారు. లోకేష్ పార్టీపై పట్టు సాధించడంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించడమే మేలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
* చంద్రబాబు దృష్టంతా అప్పట్లో పార్టీ పైనే
తెలుగుదేశం ( Telugu Desam)పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎన్టీఆర్ బలమైన పునాదులు వేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి సైతం టిడిపిని టచ్ చేసి ఏమీ చేయలేకపోయారు. పడిపోయిన ప్రతిసారి ఆ పార్టీ నిలబడుతూనే ఉంది. చంద్రబాబు సైతం తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత పార్టీ పైనే పట్టు సాధించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు చంద్రబాబు. కానీ టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అటు తరువాత టిడిపిలో చేరారు. కానీ 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసిన పని కేవలం.. పార్టీ పైనే ఫోకస్ పెట్టారు. ఐదేళ్లపాటు పూర్తి స్థాయిలో పార్టీని తన గ్రిప్ లోకి తీసుకున్నారు. 1989 ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. కానీ చంద్రబాబు మాత్రం గెలిచారు. 1989 నుంచి 94 వరకు పార్టీని పూర్తిస్థాయిలో తన హ్యాండ్ లోకి తెచ్చుకున్నారు. అందుకే 1995 సంక్షోభంలో పార్టీ చంద్రబాబుకు అండగా నిలబడింది.
* తప్పటడుగులు దాటుకొని
అయితే లోకేష్( Lokesh) విషయంలో మాత్రం చంద్రబాబు తప్పటడుగులు వేశారు. నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించకుండా.. ఎమ్మెల్సీ ని చేసి.. ఆపై మంత్రిని చేశారు. 2019 ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయేసరికి మరింత విమర్శలు చుట్టుముట్టాయి. కానీ అప్పుడే పార్టీ పై ఫుల్ ఫోకస్ పెట్టారు లోకేష్. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. పార్టీపై పూర్తిగా పట్టు సాధించుకున్నారు. అందుకే ఇప్పుడు పార్టీ శ్రేణులే మరో మాట ఆడకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. మొత్తానికి అయితే త్వరలో నారా లోకేష్ కు ప్రమోషన్ ఖాయమని తేలిపోయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.