Nara Lokesh Serious: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో ఇకనుంచి క్రమశిక్షణ కట్టు దాటితే వేటువేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న అధినేత చంద్రబాబు సైతం పార్టీ ఎమ్మెల్యేలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ గుర్తుతో గెలిచినవారు తమ సొంత బలం అనుకుంటే బయటకు వెళ్ళిపోవచ్చు అని తేల్చి చెప్పారు. అటువంటివారు తమకు అవసరం లేదని కూడా తెగేసి చెప్పారు. ఇప్పుడు లోకేష్ సైతం అదే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఎంతటి వారినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉందని.. టిడిపి కార్యకర్తల పార్టీ అంటూ తేల్చి చెప్పారు. ఎవరైనా వెళ్ళిపోవచ్చు అని సంకేతాలు ఇచ్చేందుకు ఈరోజు నెల్లూరు జిల్లా దగదర్తి కి వెళ్లారు. అక్కడ మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట లోకేష్. ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటితే క్షమించేది లేదని చెప్పారట. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని లోకేష్ ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
వెలుగు చూస్తున్న విభేదాలు..
ఇటీవల తెలుగుదేశం పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది సీనియర్ నేతలను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. అయితే కూటమి ప్రభంజనంలో అసలు గెలుపు అంచనాలు లేని వారు సైతం గెలుపొందారు. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుతో పాటు లోకేష్ పునరాలోచనలో పడ్డారు. ఎక్కడెక్కడ అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడ చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం అనుకుంటే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు.
లోకేష్ గట్టి హెచ్చరికలే..
2029 ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఇబ్బందులు ఎదుర్కొంటామని చంద్రబాబుకు( CM Chandrababu) తెలుసు. అటు లోకేష్ కు తెలుసు. ప్రస్తుతం పాలనతో పాటు పెట్టుబడులు తెచ్చేందుకు తండ్రి కొడుకులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దకపోతే 2019 రిపీట్ అవుతుందని ముందే గ్రహించారు. అందుకే పార్టీలో క్రమశిక్షణ కట్టు దాటకుండా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఏకంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. సొంత బలంతో గెలిచామని భావిస్తున్న నేతలు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళిపోవచ్చు అని కూడా తేల్చి చెప్పారు. ఇప్పుడు స్వయంగా లోకేష్ రంగంలోకి దిగి.. ఎక్కడక్కడ పరిస్థితులు బాగా లేదో.. విపులంగా నివేదిక తెప్పించుకొని దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. అయితే ఇప్పుడు పార్టీకి ఇబ్బందులు తెస్తున్న ఎమ్మెల్యేలు మారకుంటే మాత్రం 2029లో.. వారి స్థానంలో కొత్త నేతలు రావడం ఖాయం.