Jagan Padayatra: పాదయాత్ర.. ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy). కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపి 2004లో అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర. ఏపీలోనే కాదు జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అది మొదలు పాదయాత్రకు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. అదే స్ఫూర్తితో పాదయాత్ర చేసి 2014లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అటు తర్వాత 2017లో పాదయాత్ర చేసి ఏపీలో ఘనవిజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి. 2023లో పాదయాత్ర చేసి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు నారా లోకేష్. అంటే ఇప్పటివరకు ఒకేసారి పాదయాత్ర చేసిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. 2027, 2028 లో పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉండి.. 2029లో అధికారంలోకి రావాలని ప్రణాళిక వేసుకున్నారు.
అనేక సందేహాలు..
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పాదయాత్ర చేస్తే ఏమవుతుంది? అధికారానికి దగ్గర కాగలరా? కూటమిని అధికారం నుంచి దూరం చేయగలరా? అంటే మాత్రం మిశ్రమ స్పందన వస్తుంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది ప్రభుత్వం. ఒకవైపు పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధిని చేసి చూపిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పోలవరం నిర్మాణం ఆగలేదు. మరోవైపు ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థల సైతం ఏపీకి వస్తున్నాయి. ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేయడం అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించారు. ఆయన పాలన బాగా లేదని చెప్పి ప్రజలు ఆయనను అధికారం నుంచి దూరం చేశారు. ఇప్పుడు ప్రజల్లో సంతృప్తి ఉన్న తరుణంలో వారి మధ్యకు వస్తే ఎలాంటి స్పందన వస్తుందో అన్నది తెలుసుకుంటే మంచిది.
సంక్షేమంతో పాటు అభివృద్ధి..
సంక్షేమ పథకాలు( welfare schemes) అమలు చేయలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. కానీ సంక్షేమ బాట పట్టారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే రైతు భరోసా ఇచ్చారు.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు భృతి అందించారు. మత్స్యకారులకు భృతి అందించారు. పోలవరం నిర్వాసితులకు నిధులు మంజూరు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డితో సమానంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. అదే సమయంలో అభివృద్ధిని చేసి చూపించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తే గతానికి భిన్నంగా ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
తొలిసారిగా పాదయాత్ర..
2017లో తొలిసారిగా పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఆయన ప్రతిపక్ష నేత. 67 సీట్లతో బలంగా ఉన్న నాయకుడు. ఆ పై తండ్రి మరణంతో విపరీతమైన చరిస్మ సొంతం చేసుకున్న వారసుడు. పైగా ఒక్క అవకాశం అన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిన సమయం. సరిగ్గా అటువంటి సమయంలోనే పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం కాగలిగారు. అయితే ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. కానీ మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పాలన అందించలేదు. పైగా రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నెట్టారన్న ఆరోపణ ఆయనపై ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలు అంటూ ప్రజల్లోకి వస్తే ఆయనకు ప్రజల మద్దతు లభిస్తుందా? అంటే లేదనే చెప్పాలి. అయితే 40 శాతం ఓటు బ్యాంకుతో బలమైన పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురయింది. ఎంతటి ఓటమిలో సైతం ఆ పార్టీకి జనాదరణ తగ్గలేదు. వారి కోసమైనా ఆయన పాదయాత్ర చేస్తారు. కానీ సామాన్య జనాలు మునుపటి మాదిరిగా మమేకమయ్యే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి ఆయన ఎలాంటి పాదయాత్ర చేస్తారో? ఎంతవరకు సక్సెస్ అవుతారో?
BIG BREAKING NEWS
2027 లో జగనన్న ప్రజాసంకల్ప యాత్ర.
2027 – 2028 రెండేళ్లు ప్రజాసంకల్ప యాత్ర చేయనున్న జగనన్న.
– పేర్ని నాని pic.twitter.com/YetuUl3dY1
— (@YSJ2024) November 6, 2025