Nara Lokesh: ప్రతి రాజకీయ పార్టీకి ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది. కానీ విధానపరంగా వెళ్లే క్రమంలో రాజకీయాలు అలుముకుంటాయి. ఒకవైపు ప్రభుత్వ పాలన నడిపిస్తూనే రాజకీయాలు చేస్తేనే పార్టీలు మన గలవు. ప్రభుత్వపరంగా ఏ చిన్న మార్పు కోసం ప్రయత్నం చేసినా.. దాని వెనుక రాజకీయాలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. అయితే రాజకీయాలను పక్కనపెట్టి విద్యావ్యవస్థను సమూల మార్పులు తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ భావించారు. ఇందుకు గట్టిగానే అడుగులు వేశారు. వాటికి సంబంధించిన సత్ఫలితాలు వచ్చాయి. పాఠశాల విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటివరకు పత్రిక ప్రకటనలకు కేవలం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు మాత్రమే పరిమితం అయ్యాయి. తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను పత్రికల యాడ్ల రూపంలో ప్రచురించారు అంటే.. ప్రభుత్వ విద్య విషయంలో నారా లోకేష్ ఆలోచన ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతుంది.

* మారుతున్న కాలానికి అనుగుణంగా..
మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలి అంటే.. కచ్చితంగా మెరుగైన విద్యా బోధన ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా మారాలి. ఇదే ఆకాంక్షను పాఠశాల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ బయటపెట్టారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యా వరకు పాఠ్యాంశాల పునర్నిర్మాణం చేపట్టారు. క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్ వంటి గేమ్ చేంజర్ రంగాల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా లోకేష్ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. ఒక విజయంతో పనిచేసి ఎన్సీఈఆర్టీ, ఐఐటి మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో సరికొత్త కోర్సులను కూడా రూపొందించారు.
* యూనివర్సిటీల్లో మార్పులు
ఒక్క ప్రాథమిక, ఉన్నత విద్య విషయంలో మాత్రమే కాదు.. యూనివర్సిటీల విషయంలో సైతం లోకేష్ ప్రత్యేక ఆలోచనలతో ముందుకు సాగారు. యూనివర్సిటీలు అనేవి కేవలం పరీక్షలు నిర్వహించే కేంద్రాలుగా ఉండకూడదు అనేది ఆయన భావన. సరికొత్త ఆవిష్కరణలకు నిలయంగా మారాలని భావిస్తున్నారు. ప్రతి యూనివర్సిటీని ఒక పారిశ్రామిక సంస్థతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థుల్లో అనుభవం లభిస్తుంది అని భావించారు. అందుకే ప్రపంచంలోనే టాప్ 200 యూనివర్సిటీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని లక్ష్యం ఆయనలో కనిపించింది. ఎంతలా అంటే నర్సింగ్, పాలిటెక్నిక్ డిప్లమో వంటివి పూర్తి చేసిన విద్యార్థులకు ఏకంగా జర్మన్, రష్యా వంటి భాష లను నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు లభించే స్థాయికి వారిని తీర్చిదిద్దుతున్నారు అంటే లోకేష్ ఆలోచన ఇట్టే అర్థం అవుతుంది.
* అన్ని అంశాల్లో మార్పు..
పాఠశాల విద్యాశాఖ స్వరూపాన్ని మార్చారు. విద్యా బోధనను మార్చారు. పాఠ్యాంశాలను మార్చారు. అంతటితో ఆగలేదు ఆయన ప్రయత్నం. మధ్యాహ్నం భోజనం లో సమూల మార్పులు తీసుకొచ్చారు. పోషకాలతో కూడిన మెనూ, కిచెన్ గార్డెన్లు, డిజిటల్ బోధన ద్వారా పాఠశాల విద్యను మరింత బలోపేతం చేశారు. లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉండడం.. మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి చిన్న అంశాలనుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి పెద్ద అంశాల వరకు.. అన్ని నారా లోకేష్ ఆలోచనలే. వైసీపీ హయాంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వాటిని గాడిలో పెట్టే పనిలో లోకేష్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను సైతం పత్రికలకు యాడ్ల రూపంలో ఇచ్చారు అంటే.. ప్రభుత్వ విద్యను ఏ స్థాయిలో నిలబెట్టారు అనేది ఇట్టే అర్థమవుతోంది.