Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) మహానాడుకు దూరంగా ఉన్నారా? తొలి రెండు రోజులు ఎందుకు హాజరు కాలేదు? అసంతృప్తి కారణమా? లేకుంటే షూటింగ్లో బిజీగా ఉన్నారా? కనీసం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ కు కూడా ఎందుకు రాలేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కడపలో ఈ నెల 27 నుంచి మహానాడు ప్రారంభం అయింది. తొలి రెండు రోజులు విజయవంతంగా పూర్తయింది. ఈరోజు మూడో రోజు కార్యక్రమం జరగనుంది. దాదాపు 5 లక్షల మంది టీడీపీ శ్రేణులు, అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కానీ నందమూరి కుటుంబం నుంచి ఎవరూ కనిపించలేదు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆపై పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. ఆయన మహానాడుకు రాకపోవడం ఏమిటనేది ఇప్పుడు చర్చకు తావిస్తోంది.
* బాలకృష్ణ పై కుటుంబ భారం..
ప్రస్తుతం నందమూరి కుటుంబ బాధ్యతలు అన్ని బాలకృష్ణ చూస్తున్నారు. ఆ కుటుంబంలో ఎటువంటి వేడుక అయినా.. కార్యక్రమం జరిగినా బాలకృష్ణ పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్( Junior NTR), కళ్యాణ్ రామ్ తప్పించి నందమూరి కుటుంబమంతా బాలకృష్ణ నీడలోనే ఉంది. మరోవైపు అక్కాచెల్లెళ్ల కుటుంబాలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ తో కలిసి పని చేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మరోవైపు లోకేష్ కు ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ కనిపించకపోవడం తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది.
Also Read : ఒకే వేదిక పైకి ప్రధాని మోదీ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్!
* సినిమా షూటింగ్ లతో బిజీ..
అయితే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ లతో( cinema shootings ) బిజీగా ఉండడం వల్లే మహానాడుకు హాజరు కాలేదని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో అఖండకు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. బోయపాటి శ్రీను తో బాలకృష్ణ సినిమా అంటే ఒక రకమైన అంచనాలు ఉంటాయి. వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్ కూడా. అందుకే అఖండ 2 చిత్రంపై చాలా రకాల అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. మొన్న ఆ మధ్యన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. మధ్యలో పొలిట్ బ్యూరో సమావేశానికి సైతం రాలేదు. ఇప్పుడు మహానాడుకు కూడా ఆ కారణంతోనే హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే చివరి రోజు నందమూరి బాలకృష్ణ మహానాడుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆయనతోపాటు ఫ్యామిలీ మొత్తం హాజరవుతారని తెలుస్తోంది.
* ఈరోజు హాజరయ్యే అవకాశం..
నందమూరి కుటుంబం లో రాజకీయాల్లో ఉన్నది ఒక్క బాలకృష్ణ మాత్రమే. మరోవైపు అల్లుళ్ళు నారా లోకేష్( Nara Lokesh), శ్రీ భరత్ సైతం ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇంకోవైపు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తెలంగాణ టిడిపిలో యాక్టివ్ గా ఉన్నారు. ఆమెకు త్వరలో పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ కార్యక్రమాలకు ఆమె నిత్యం హాజరవుతుంటారు. మరోవైపు మహానాడుకు సైతం ఆమె వచ్చారు. ఈరోజు చివరి రోజు కావడంతో బాలకృష్ణ మహానాడుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా హాజరవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.