Mahanadu : కడపలో( Kadapa ) టిడిపి మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. తొలి రెండు రోజులు సక్సెస్ అయ్యింది. ఈరోజు చివరి రోజు. దాదాపు 5 లక్షల మంది టిడిపి అభిమానులు వస్తారని ఒక అంచనా. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్ననే జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన వరుసగా 30 సంవత్సరాల పాటు టిడిపి అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు మరోసారి ఎన్నిక కావడంతో మరో రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఇంకోవైపు నారా లోకేష్ కు పదోన్నతి ఖాయమని ప్రచారం సాగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని తెలుస్తోంది. అయితే మహానాడు వేదికగా సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మహానాడు నిర్వహించేందుకు భూములు ఇచ్చిన రైతులను సీఎం చంద్రబాబు అభినందించారు. బుధవారం రాత్రి వారితో కలిసి భోజనాలు కూడా చేశారు. మహానాడుకు భూమిని ఇచ్చినందుకు అభినందించారు. చంద్రబాబు పిలిచి మరి విందు ఇవ్వడంతో రైతులు ఎంతగానో ఆనందించారు. మరోవైపు సైకిల్ యాత్ర చేపట్టిన టిడిపి కార్యకర్తలను అభినందించారు చంద్రబాబు.
* చంద్రబాబు అరెస్టుకు నిరసనగా..
2023 సెప్టెంబర్ లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసింది. దాదాపు 52 రోజులపాటు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండిపోవాల్సి వచ్చింది. అప్పట్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఆరుగురు టిడిపి కార్యకర్తలు కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే వారి యాత్ర పుంగనూరు నియోజకవర్గానికి వచ్చేసరికి అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వారిని అడ్డుకున్నారు. వారి దుస్తులను ఇప్పించి అవమానించారు. అయితే తాజాగా అవమానం ఎదురైన చోట నుంచి మళ్లీ సైకిల్ యాత్ర చేపట్టి మహానాడుకు వచ్చారు. అలా వచ్చిన వారితో చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. వారికి ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేశారు. అందులో అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించాలని సూచించారు. వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలో లేదా మంచి పాఠశాలలో చదివించాలని చెప్పారు.
Also Read : మహానాడులో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
* అధినేత అభినందన..
శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఓ ఆరుగురు కార్యకర్తలు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు అన్ని జిల్లాలను దాటుకొని వెళ్లారు. దారి పొడవునా ఆలయాల్లో చంద్రబాబు తరఫున ప్రత్యేక పూజలు కూడా చేశారు. అయితే కుప్పం వెళ్లే క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో వీరికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు సూరి వీరిని అడ్డగించారు. ఇది పెద్దిరెడ్డి అడ్డా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దుర్భాషలాడుతూ దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనతో ఆరుగురు కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. చివరకు టిడిపి రాష్ట్ర నాయకులు రక్షణగా నిలిచి వారిని అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు అదే చోట నుంచి మహానాడు జరుగుతున్న కడప వరకు సైకిల్ యాత్ర చేపట్టారు వారు. అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ అభినందించేసరికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.