Rajya Sabha by-election : ఏపీలో రాజ్యసభ పదవుల భర్తీ విషయంలో సమీకరణలు మారుతున్నాయి. వైసీపీకి చెందిన ముగ్గురు సభ్యులు పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు.మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.అయితే కూటమికి ఏపీలో ఏకపక్ష మెజారిటీ ఉంది. ఆ మూడు స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకుంటాయి. కూటమి నేపథ్యంలో మూడు పార్టీలకు చెరో పదవి లభిస్తుందని అంతా భావించారు. అయితే ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతున్నాయి. నామినేషన్ల దాఖలు గడువు సమీపిస్తుండడంతో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. అయితే ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ మూడు స్థానాలు బీసీలు ప్రాతినిధ్యం వహించినవే. ఆ స్థానాల్లో వారికి ఛాన్స్ ఇవ్వాల్సి వస్తోంది. లేకుంటే ఇబ్బందికరమని కూటమి భావిస్తోంది. కూటమి తీరుపై విమర్శలు వ్యక్తమవుతాయని అనుమానిస్తోంది. దీంతో అన్ని రకాల సమీకరణలకు పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకోనుంది.
* ఆ ఇద్దరికీ ఖాయమే
వైసిపికి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే సమయంలో వారికి కూటమి పార్టీల నుంచి ఒక హామీ వెళ్లినట్లు సమాచారం. మోపిదేవి వెంకటరమణ మరోసారి రాజ్యసభకు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. బీద మస్తాన్ రావు మాత్రం మరోసారి రాజ్యసభకు చాన్స్ ఇస్తామన్న హామీ మేరకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ తరఫున ఆయన ఎంపిక ఖాయమైనట్లు సమాచారం. ఇంకోవైపు కృష్ణయ్య బిజెపి వైపు అడుగులు వేస్తున్నారు. ఆయనకు మరోసారి రాజ్యసభ సీటు ఇచ్చి తెలంగాణలో పార్టీ బలోపేతానికి మార్గం చూపవచ్చు. అందుకే బిజెపి తరఫున కృష్ణయ్యకు ఖాయం అయినట్టు.
*:మూడోది ఎవరికి?
అయితే మూడో పదవి ఎవరికి ఇస్తారు? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తొలుత బిజెపి కి కాకుండా జనసేనకు ఒక పదవి ఖాయమని ప్రచారం సాగింది. ప్రధానంగా నాగబాబు పేరు వినిపించింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మరి చర్చించినట్లు ప్రచారం నడిచింది. అయితే తాజాగా నాగబాబు ట్వీట్ చూస్తే మాత్రం ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు కనిపిస్తోంది. ఇంకో వైపు టిడిపికి ఉన్న రెండు పదవి కోసం కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, సాన సతీష్ ల మధ్య ఫైట్ నెలకొన్నట్టు సమాచారం. మొత్తానికి అయితే ఏపీలో రాజ్యసభ పదవుల మిస్టరీ ఇంకా వీడడం లేదు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.