JC Prabhakar Reddy : ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. అది కూడా రాయలసీమ నుంచి. తాజాగా కడప జిల్లాలో నెలకొన్న వివాదంపై దృష్టి పెట్టారు చంద్రబాబు. సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించే బూడిద విషయంలో పెద్ద పంచాయితీ నడుస్తోంది. రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు బూడిద తరలిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. రోజుకు ఐదు లక్షల వరకు చేతులు మారుతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో జెసి ప్రభాకర్ రెడ్డి మంచి పట్టుదలతో ఉన్నారు. చాలా ఏళ్లుగా అక్కడ నుంచి బూడిదను తరలిస్తున్నారు. ఇప్పుడు దానిపైనే పట్టుబడుతున్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. పరిస్థితులు చేయి దాటుతుండడంతో పోలీసులు కలుగ చేసుకోవాల్సి వస్తోంది.అయితే ఒకరు టిడిపి సీనియర్ నేత కావడం, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే కావడంతో కూటమి పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశం ఉంది.
* సీఎంఓ కు పంచాయితీ
అయితే ఈ పంచాయితీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎంఓ కు రావాలని జెసి ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆదినారాయణ రెడ్డి కి సమాచారం అందించారు. అయితే ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. ప్రభాకర్ రెడ్డి మాత్రం ముఖం చాటేశారు. జ్వరంగా ఉందని చెప్పి గైర్హాజరయ్యారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఆదినారాయణ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉందని… అందుకే కార్యక్రమానికి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది.
* సుదీర్ఘ నేపథ్యం
జెసి కుటుంబానికి రాయలసీమలో ప్రత్యేక స్థానం. 2014 ఎన్నికలకు ముందు ఆ కుటుంబం అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గూటికి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎంపీగా జెసి దివాకర్ రెడ్డి గెలిచారు. ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ఇద్దరూ వారసులను బరిలోకి దించారు. కానీ ఓటమి తప్పలేదు. అయితే ఐదేళ్లుగా వైసీపీని ధీటుగా ఎదుర్కొన్నారు జెసి ప్రభాకర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కానీ తాడిపత్రిలో మాత్రం జెసి ప్రభాకర్ రెడ్డి హవా నడిచింది. ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితే అనంతపురం జిల్లా వరకే పరిమితం కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు కడప జిల్లా వివాదంలో వేలు పెట్టడంతో చంద్రబాబుకు కొత్త చికాకు వచ్చి పడింది. మరి దీనిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.