Annadata Sukhibhav Scheme : ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. సంక్షేమ పథకాల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. తాజాగా రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అటు కొత్త పింఛన్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలో ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల నాలుగో తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశం.. ఒకరోజు ముందుగానే జరగనుంది. అయితే దీనికి ఎంతగానో ప్రాధాన్యత సంతరించుకుంది. క్యాబినెట్ భేటిలో కీలక అంశాలను చర్చించనున్నారు. వాటికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇటీవల కాకినాడ పోర్ట్ లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ ఆ బియ్యాన్ని పరిశీలించారు. వెనుక ఉన్న మాఫియాను పూర్తిగా నియంత్రించాలని భావిస్తున్నారు. దీంతో క్యాబినెట్లో బియ్యం అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. రేషన్ బియ్యం పక్కదారిపై ప్రభుత్వం సీరియస్ చర్యలకు దిగే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికిగాను ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది.
* కొత్త రేషన్ కార్డులు
ఎట్టి పరిస్థితుల్లో జనవరి నాటికి కొత్త రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడు లక్షల మందికి రేషన్ కార్డులు అందించాలని భావిస్తోంది. అయితే పాత రేషన్ కార్డులను సైతం కొత్తగా డిజైన్ చేసి అందించాలని చూస్తోంది. జనవరి 2 నాటికి జన్మభూమి 2 కార్యక్రమం నిర్వహించాలని భావిస్తోంది. అందుకు సంబంధించి విధివిధానాలను సైతం రూపొందిస్తోంది. దీనిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. జన్మభూమి కార్యక్రమంలో నే కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతరత్రా సంక్షేమ పథకాలు ఇవ్వాలని భావిస్తోంది.
* ఆ రెండు పథకాలపై
ఇప్పటికే అన్నదాత సుఖీభవకు బడ్జెట్లో నిధులు కేటాయించింది ప్రభుత్వం. సంక్రాంతి నాటికి రైతుల ఖాతాలో 20వేల రూపాయలు వేయాలని భావిస్తోంది. దానిపైన క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే విధివిధానాలను రూపొందించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని పరిశీలించి కీలక ప్రతిపాదనలతో ఒక నివేదిక తయారు చేశారు. దానిపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం తరలింపు, అదాని నుంచి ముడుపులు తీసుకోవడం వంటి అంశాలపై సైతం క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ నెల 4న జరగాల్సిన క్యాబినెట్ సమావేశం.. ఒకరోజు ముందుగానే నిర్వహిస్తుండడం విశేషం.