Homeఆంధ్రప్రదేశ్‌సీఎం గారూ 19న పర్చూరు రండి.. కౌలు రైతుల కన్నీటి వేదన తెలుస్తుంది

సీఎం గారూ 19న పర్చూరు రండి.. కౌలు రైతుల కన్నీటి వేదన తెలుస్తుంది

* జనసేన కౌలు రైతుల భరోసా సభకు ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ఆహ్వానం

* కౌలు రైతుల చట్టాన్ని వైసీపీ నిర్వీర్యం చేసింది

* కౌలు రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి

* శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఈ ముఖ్యమంత్రికి భయం వేస్తోంది

* 19న పర్చూరు కౌలు రైతుల సభను జయప్రదం చేయండి

* గుంటూరులో విలేకర్ల సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

Nadendla Counter
Nadendla Manohar

‘ముఖ్యమంత్రి గారు.. మాతో కలిసి 19వ తేదీన పర్చూరు రండి.. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కౌలు రైతుల భరోసా యాత్రకు మీకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. అక్కడకు వస్తే మీ కళ్లరా కౌలు రైతులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో.. వారి కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి ఏ విధంగా వేదన అనుభవిస్తున్నారో స్వయంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ తీరుపై రైతు కుటుంబాల కడుపు మంటను కళ్ళారా చూడొచ్చు’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్డ్  నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. పర్చూరు సభకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డికి ఆహ్వానం పలికారు. గుంటూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘ఎక్కడికి వెళ్లినా 15 వందల మంది పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకొని పర్యటనలకు వెళ్లే శ్రీ జగన్ రెడ్డికి పేదల కష్టాలు ఏం తెలుస్తాయి..? రైతుల ఆవేదన ఏం పడుతుంది..? ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఆ రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందడుగు వేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ.5 కోట్లను ప్రత్యేక నిధికి జమ చేశారు. దీనికి నేతలంతా ముందుకొచ్చి తమ వంతుగా సాయం చేయడంతోపాటు, విదేశాల నుంచి సైతం కొందరు పార్టీ సానుభూతిపరులు విరాళాలు ఇచ్చారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో కౌలు రైతుల భరోసా యాత్రను మొదటి విడత పూర్తి చేశాం. 19వ తేదీన నాలుగో జిల్లాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలవన్మరణాలకు పాల్పడిన 76 మంది కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు, ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 19వ తేదీ, ఆదివారం ప్రకాశం జిల్లా రానున్నారు. ఏటుకూరు, చిలకలూరిపేట, రాజుపాలెం, జాగర్లమూడి మీదుగా పర్చూరు వరకు జనసేన అధ్యక్షుల వారి పర్యటన ఉంటుంది. పర్చూరులో బహిరంగ సభ ఉంటుంది.

అంతా ఏకమై ముఖ్యమంత్రి నిరంకుశ ధోరణిని, ఆయన పదేపదే రైతులను అవమానిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాలి. ఈ ముఖ్యమంత్రి మొండి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అర్హత కలిగిన రైతులకు ప్రభుత్వ సాయం అందిందని ముఖ్యమంత్రి చెప్పడం చాలా దారుణం. అర్హత లేని వారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాయం అందిస్తున్నారని చెబుతున్న శ్రీ జగన్ రెడ్డి ఎంత అవివేకంతో మాట్లాడుతున్నారో.. తప్పుడు సమాచారం పొందుతున్నారో అర్థం అవుతుంది.

* కౌలు రైతు కార్డుల పంపిణీ సక్రమంగా లేదు

నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతిగా ఉన్నపుడు కౌలు రైతుల కోసం ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చాం. ఆ చట్టంలో భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతుకు మేలు జరిగేలా కొన్ని కీలక అంశాలను ఉంచాం. కౌలు రైతులకు రుణాలతో పాటు ప్రభుత్వ రాయితీలు, విత్తన సబ్సీడీలు, యంత్ర పరికరాలకు సంబంధించిన సబ్సీడీలు నేరుగా కౌలు రైతులకు అందేవి. అయితే 2019లో ఈ చట్టానికి ఈ ముఖ్యమంత్రి పూర్తిస్థాయి మార్పులు తీసుకొచ్చారు. భూ యజమాని 11 నెలల రెంటల్ అగ్రిమెంటును కౌలు రైతుకు ఇస్తేనే వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభం అయింది. భూ యజమానుల ఆధార్ కార్డును ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో భూ యజమానులెవరూ దీనికి ముందుకు రావడం లేదు. ఫలితంగా కౌలు రైతుల గుర్తింపు జరగడం లేదు. నేడు రాష్ట్రంలో దాదాపు 70 శాతం కౌలు రైతులే కనిపిస్తారు. డెల్టా ఏరియాల్లో ఏకంగా 80 శాతం కౌలు రైతులే. వారికి గుర్తింపు లేదు. 2011లోనే 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కల్లో తేలింది. మరిప్పుడు ఆ సంఖ్య కేవలం 16 లక్షలకు పడిపోవడంలో ఆంతర్యం ఏమిటి..? ప్రభుత్వం చెబుతున్న సీసీఆర్సీ కార్డుల పంపిణీలోనూ సరైన సహేతుకత లేదు. గుంటూరు జిల్లాలోనే 2.30 లక్షల మంది కౌలు రైతులు ఉంటే, ప్రస్తుతం 1.61 లక్షల మంది కౌలు రైతులే ఉన్నట్లు చెబుతున్నారు. 68 వేలు సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 53 వేల మందికి మాత్రమే కార్డులు ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో 1.2 లక్షల మంది కౌలు రైతులు ఉంటే సీసీఆర్సీ కార్డులు 35 వేలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. కేవలం 18 వేలు కార్డులు ఇచ్చారు. సీసీఆర్సీ కార్డులు ఇచ్చిన ఈ రైతులేనా సీఎం చెబుతున్న అర్హత ఉన్న రైతులు..? వీరేనా మీరు లెక్కలు చెప్పే రైతులు..? పల్నాడు జిల్లాలో వారం రోజుల్లో ఏకంగా 5 ఆత్మహత్యలు జరిగాయి. ఈ పరిస్థితి ఈ ముఖ్యమంత్రికి అర్థం అవుతుందో లేదో కూడా తెలియదు. వ్యవసాయం అంటే బాబోయ్ అని పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వ తీరుతో ఇప్పటికీ రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.

* ఆదరించకపోగా విమర్శలా..?

కేంద్రం అందించే రైతు భరోసా సాయంలోనూ రాష్ర్ట ప్రభుత్వం కులాలను చూస్తోంది. దీనిలోనూ ఓట్ల రాజకీయాలకు తెరలేపింది. ప్రతి ఏటా కేంద్రం రూ. 17 వేల కోట్లను సాయంగా ఇస్తుంటే, దాన్ని రాష్ర్ట ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కౌలు రైతులను నిండు మనస్సుతో ఆదరించాల్సిన రాష్ర్ట ప్రభుత్వం- పదేపదే వారు అసలు రైతులే కాదు.. అన్నట్లు మాట్లాడుతోంది.

ప్రతిసారి ఈ ముఖ్యమంత్రి కౌలు రైతులను అవమానపరుస్తున్నారు. వారి వేదనను అపహాస్యం చేస్తున్నారు. వారి చావులను చిన్నవి చేసి మాట్లాడుతున్నారు. కచ్చితంగా కౌలు రైతులను అవమానపర్చేలా మాట్లాడుతున్న

ఈ ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. రైతులకు ఏ మేలు చేయని శ్రీ జగన్ రెడ్డికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న

సాయం చూసి భయం వేస్తోంది. అందుకే ప్రభుత్వ సభల్లో రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. ఇంతటి బృహత్ కార్యం చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నిండు మనస్సుతో అభినందించాల్సిన ముఖ్యమంత్రి దానిని పక్కన పెట్టి రాజకీయ విమర్శలకు దిగడం అత్యంత హేయం. ఆయన ఎంత సంస్కారవంతుడో దీనిని బట్టే అర్ధమవుతుంది.

* పంట రుణాలు ఎక్కడ?

రాష్ర్ట బడ్జెట్లో కౌలు రైతులకు సంబంధించి రూ.1.11 లక్షల కోట్ల రుణాల ఇస్తామని ప్రకటించారు. ఇచ్చింది కేవలం రూ.4,100 కోట్లు మాత్రమే. కౌలు రైతులు సాగు కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి దానిని కట్టుకలేక ఇబ్బందిపడుతున్నారు. రబీ ధాన్యం అమ్మినా డబ్బులు ఇవ్వడం లేదు. 50 రోజులు కావొస్తున్నా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.400 కోట్లు ఇంకా రైతుల ఖాతాల్లో పడాల్సి ఉంది. అలాగే ప్రకాశం జిల్లాలోనూ 25 కోట్ల రూపాయలు రైతులకు అందాలి. ఇన్ని సమస్యలు ఒక పక్క ఉంటే దాని కోసం మాట్లాడుకుండా, ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద విమర్శలు చేసి సీఎం ఆనందపడుతున్నారు. మీ విమర్శల్ని పక్కన పెట్టి ముందు రైతు సమస్యలు తీర్చేలా దృష్టి సారించండి.

* ఇంకా ఎవరైనా ఉన్నా సాయం చేస్తాం…

కేవలం మా దృష్టికి వచ్చిన కౌలు రైతుల కుటుంబాలకే కాకుండా.. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. కేవలం ఇంత మందికే సాయం చేస్తామని మేం లక్ష్యం పెట్టుకోలేదు. ప్రతి బాధితుడికి సాంత్వన చేకూరాలి అన్నదే మా లక్ష్యం. ఇదో గొప్ప ఆశయంతో ముందుకు సాగుతుంది. కేవలం బాధిత కుటుంబాలకు రూ.లక్ష ఇచ్చేసి బాధ్యత అయిపోయింది అనుకోవడం లేదు. వారి కుటుంబాల్లోని పిల్లలకు మేం విద్య గురించి, భవిష్యత్ గురించి భరోసా ఇచ్చేలా గొప్ప ఆలోచన చేస్తున్నాం. బాధిత కౌలు రైతు కుటుంబాల్లో గొప్ప వ్యక్తులు బయటకు రావాలి. రైతు సమస్యల మీదనే కాదు.. ప్రజా సమస్యల మీద కూడా ఎప్పటికప్పడు స్పందిస్తున్నాం. రోడ్ల సమస్య మీద, భవన నిర్మాణ కార్మికుల సమస్య, ధాన్యం కొనుగోళ్ల సమస్య, తుపాను సమయాల్లో పర్యటనలు చేశాం. వాటిపై ప్రజా పోరాటాలు నిర్వహించాం” అన్నారు. సమావేశంలో పార్టీ గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వర రావు, శ్రీ షేక్ రియాజ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, డా.పాకనాటి గౌతమ్ రాజ్, శ్రీ నయాబ్ కమల్, శ్రీ సయ్యద్ జిలానీ, శ్రీ బేతపూడి విజయ శేఖర్, డా. బండారు రవికాంత్, శ్రీమతి రాయపాటి అరుణ, శ్రీ నేరెళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular