Most Emotional Marriage : ఖరీదైన భారీ కళ్యాణమండపం.. ఎటూ చూసినా భారీ ఏర్పాట్లు.. పెళ్లి కూతురు, పెళ్లికొడుకు రెడీగా ఉన్నారు. మరికాసేపట్లో పెళ్లి. పెళ్లి కూతురు తల్లి, వాళ్ల అన్నయ్య ఎమోషనల్ గా ఉన్నారు. ఇంతలో డోర్ లోంచి వీల్ చైర్ పై ఒకరు వస్తున్నారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ.. కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. కన్నీళ్లు అదిమిపెట్టుకోలేక జలజలా జాలుతున్నాయి.. చనిపోయిన నాన్న బతికి సజీవంగా వస్తున్నట్టు ఆ రూపం.. అందరిలోనూ ఎమోషన్ పతాకస్థాయికి చేరింది. కన్నీళ్ల వరద పారింది.

తమకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి ఆ కూతురి పెళ్లి కి లేడు. ఎన్నో ఆస్తులు పంచి.. ఎంతో చదివించి ప్రయోజకులు చేసిన ఆ తండ్రి ఇటీవలే చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు, పెళ్లికొడుకు అన్ననే దగ్గరుండి ఆ పెళ్లిని ఘనంగా నిర్వహిస్తున్నాడు. అన్నీ తానై ఏర్పాట్లు చేశాడు. తీరా పెళ్లికి అందరూ సిద్ధం కాగానే అందరికీ షాకిచ్చాడు.
చనిపోయిన నాన్న గుర్తును మళ్లీ ఆయన కుమారుడు పున:సృష్టించాడు. మైనంతో నాన్న విగ్రహాన్ని అచ్చు గుద్దినట్టు తయారు చేయించాడు. అచ్చం ఆ నాన్నే తిరిగివచ్చినట్టు ఆ రూపం ఉంది. కానీ ఇలా మైనం విగ్రహాన్ని రూపొందించినట్టు ఎవరికీ తెలియదు. అందరికీ చెప్పకుండా ఆయన కుమారుడు ఈ ప్లాన్ చేశాడు. తన చెల్లికి నాన్న లేని లోటును ఈ పెళ్లిలో తీర్చాలని.. ఆమెకు సర్ ప్రైజ్ ఇవ్వాలని ఈ ప్లాన్ చేశాడు.
నాన్న ఎంట్రీ చూడగానే అందరూ తట్టుకోలేకపోయారు. ఆయన భార్యలో కన్నీళ్లు ఉబికివచ్చాయి. ఇక కూతురు తట్టుకోలేక బోరున విలపించింది. నాన్నను హత్తుకొని ఏడ్చేసింది. తనివితీరా ముద్దు పెట్టుకుంది. ఇక బంధువులు, కుటుంబ సభ్యులు ఆ మైనపు విగ్రహాన్ని చూసి ఆయనను పట్టుకొని కన్నీళ్లు కార్చారు.
తన చెల్లి పెళ్లికి తన తండ్రిని తీసుకురావాలని.. ఆమెకు జీవితంలో మరుపురాని కానుకగా మిగిల్చాలని ఆమె సోదరుడు చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులంతా ఆయనతో ఫొటోలు దిగి పెళ్లిని పరిపూర్ణం చేశారు. ఆయన లేని లోటు భర్తీ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Recommended Videos