Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham: హైడ్రామా : ఎట్టకేలకు వైసీపీలోకి ముద్రగడ

Mudragada Padmanabham: హైడ్రామా : ఎట్టకేలకు వైసీపీలోకి ముద్రగడ

Mudragada Padmanabham: ఎట్టకేలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. గత కొంతకాలంగా ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈనెల 14న ముద్రగడ వైసీపీలో ఎంట్రీ కి ముహూర్తం నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా కోరారు. అయితే ఇంతలో మనసు మార్చుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరూ రావద్దని సూచించారు. అటు చేరికను సైతం వాయిదా వేసుకున్నారు. దీంతో అందరిలోనూ ఒక రకమైన అనుమానం నెలకొంది. కానీ ఆ అనుమానాలను తెరదించుతూ ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు.

ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు.కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు.అటు తరువాత టిడిపిలో కూడా చేరారు.ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుతో పనిచేశారు. అటు తర్వాత రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారు. 2009లో పిఠాపురంలో ఓటమి ఎదురైన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. 2014లో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ హామీ ఇవ్వడంతో.. అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ బాట పట్టారు. చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు.అది పతాక స్థాయికి చేరింది. హింసాత్మక ఘటనలకు దారితీసింది. దీంతో కాపుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. ఇంతలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ కాపులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దానికి ముద్రగడ కారణమన్న విమర్శ ఉంది. వైసీపీ కోసమే ఆయన రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపారన్న ఆరోపణ ఉంది. అందుకు తగ్గట్టుగానే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాన్ని నిలిపివేశారు.

గత ఐదు సంవత్సరాలుగా ముద్రగడ వైసీపీలో చేరతారని బలమైన ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆయన వైసీపీలో చేరలేదు. అయితే ఎన్నికల సమీపించడంతో తన కుమారుడు గిరి కి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావించారు. వైసీపీ నుంచి ఆహ్వానం ఉండడంతో ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే మధ్యలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసిపి ముద్రగడ కుటుంబ సభ్యులకు టికెట్ నిరాకరించడంతో మనస్థాపానికి గురయ్యారు. తనతో మాట్లాడడానికి ప్రయత్నించిన వైసీపీ కీలక నేతలకు ముఖం చాటేశారు. కనీసం వారితో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. ఈ తరుణంలో జనసేన నేతలు ఆయనకు టచ్లోకి వెళ్లారు. పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి ఆహ్వానిస్తారని చెప్పుకొచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి స్పందన లేదు.దీనిని అవమానంగా భావించిన ఆయన వైసీపీలో చేరడమే ఉత్తమమని ఒక నిర్ణయానికి వచ్చారు.అయితే ఇంతలో బీజేపీ నేతలు సైతం ముద్రగడను పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి.కానీ వాటన్నింటినీ తెర దించుతూ ముద్రగడ తన కుమారుడితో కలిసి వైసిపి గూటికి చేరడంతో హైడ్రామాకు తెరపడింది.వైసిపి అధికారంలోకి వస్తే రాజ్యసభ ఆఫర్ తోనే ముద్రగడ ఆ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడంతో పాటు పవన్ ను అలాగైనా ఓడించాలన్న లక్ష్యంతోనే జగన్ ముద్రగడను పార్టీలో చేర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular