Mudragada Padmanabham: ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇప్పటికే 99 స్థానాలకు టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. అధికార వైసిపి కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్చార్జిలను ప్రకటిస్తోంది. అయితే శనివారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇన్ని రోజులపాటు పవన్ కళ్యాణ్ ను విమర్శించిన ముద్రగడ పద్మనాభాన్ని జగన్మోహన్ రెడ్డి వైసీపీలో చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆయనకు పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదయింది.
పిఠాపురం స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఊహగానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కు అక్కడ చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పిఠాపురం స్థానం లో వంగ గీత వైసిపి ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆమెకు అనూహ్యంగా సీఎమ్ఓ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ఆమె వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్లిపోగా.. పిఠాపురం ఇన్చార్జిగా ముద్రగడ పద్మనాభాన్ని నియమిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. వీటిని బలపరిచేలా ముద్రగడ పద్మనాభం కూడా తన రాజకీయ ప్రయాణం వైసీపీతో మొదలవుతుందని సంకేతాలు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే జగన్ కూడా పిఠాపురం స్థానాన్ని ముద్రగడ పద్మనాభానికి ఓకే చేశారని చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లోనూ వైసీపీ గెలిచింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారు. అప్పట్లో ఆయన కాకినాడ నుంచి పోటీ చేస్తారని చర్చ జరిగింది. కాకినాడ సంబంధించిన కొంతమంది నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కూడా అయ్యారు. అయితే అక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పడంతోనే పవన్ కళ్యాణ్ పీఠాపురం ఎంచుకున్నారని తెలుస్తోంది. మొదటి జాబితాలో పిఠాపురానికి అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. పిఠాపురంలో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానాన్ని ఎంచుకోగానే జగన్ అత్యంత తెలివిగా అక్కడ ఇన్చార్జిగా ఉన్న వంగ గీతను వెనక్కి రపించి ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపారు. ఆయన కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.