CM Jagan: ఎవరేమన్నా కానీ.. బతికించావయ్యా.. ఈ విషయంలో జగన్ ను మెచ్చుకోవాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భార్య భర్తలైన ఇద్దరు వైద్యులు కోవిడ్ రెండవ దశలో అనారోగ్యానికి గురయ్యారు. అందులో భర్త ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి.

Written By: Suresh, Updated On : March 2, 2024 12:25 pm
Follow us on

CM Jagan: ఆపదలో ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తిని ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడే అండగా నిలబడాలి. అప్పుడే మానవత్వం పరిమళిస్తుంది. మనిషి జన్మ సార్థకమవుతుంది. అలాంటి ఘనత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందంటున్నారు ఓ వైద్యురాలు. మిగతా ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ.. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ను ఆమె పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భార్య భర్తలైన ఇద్దరు వైద్యులు కోవిడ్ రెండవ దశలో అనారోగ్యానికి గురయ్యారు. అందులో భర్త ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి. అసలు పని చేసే పరిస్థితి లేకపోవడంతో వాటిని మార్చాలని వైద్యులు సూచించారు. అప్పట్లో ఆ దంపతుల వద్ద కేవలం ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయి. అవి రెండు రోజుల వైద్యానికి సరిపోయాయి. అప్పట్లో ఆ దంపతులు పనిచేసిన హాస్పిటల్, వారి బ్యాచ్ మేట్స్ తలా కొంత నగదు ఇచ్చారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఈ విషయం అప్పటి వైద్య శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలిసింది. దీంతో ఆయన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.. ఆయన వెంటనే స్పందించి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆ వైద్యుడి చికిత్స కయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.

అలా అతడికి కోటి 17 లక్షల ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించింది. కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకున్నాడు. ఇటీవల ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ఆధ్వర్యంలో మాటా మంత్రి అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తమ జీవితంలో జరిగిన సంఘటనను ఆ వైద్యులిద్దరూ ఆమెతో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సజ్జల భార్గవ్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. అదే సమయంలో కోవిడ్ కాలంలో మాస్కులు లేవని ప్రశ్నిస్తే దళిత డాక్టర్ సుధాకర్ ను చంపించారు. అది గుర్తుకు లేదా అని టిడిపి నాయకులు భార్గవ్ కు కౌంటర్ ఇచ్చారు. “ఆ దంపతులిద్దరూ డాక్టర్లై ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోలేదా? ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్ కు 12 లక్షల అవుతాయి? మరి కోటి 17 లక్షలు ఎందుకు ఖర్చు చేశారు? అసలు విద్యార్థులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆ వైద్యులకు ఏం పని? ఎన్నికలకు ముందు పీకే టీం పనిచేస్తోందంటూ” టిడిపి, జనసేన అనుకూల నెటిజన్లు ప్రశ్నను సంధిస్తున్నారు. కాగా భార్గవ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. దీనిని వైసిపి అనుకూల సోషల్ మీడియా రీ ట్వీట్ చేస్తోంది.