CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) హుందాగా ఉంటారు. హుందా రాజకీయాలు చేస్తారు. ఈ మాట అంటోంది ఎవరో కాదు. సాక్షాత్ వైసిపి నేతలే ఈ మాటలు చెబుతున్నారు. మొన్న ఆ మధ్యన మాజీ మంత్రి పేర్ని నాని( perni Nani ) చంద్రబాబు హుందాతనం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయంపై పేర్ని నాని భార్యపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుల విషయంలో మంత్రి కొల్లు రవీంద్ర చంద్రబాబుపై ఒత్తిడి పెంచారట. ఆ సమయంలో చంద్రబాబు ఆడవారితో రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారట. అదే విషయాన్ని పేర్ని నాని గుర్తు చేసుకుని మాట్లాడారు. చంద్రబాబు హుందాతనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది మరువకముందే తాజాగా ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) చంద్రబాబు స్వభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయనకే లేఖ రాశారు.
* గత కొద్దిరోజులుగా సైలెంట్
గత కొద్దిరోజులుగా ముద్రగడ( mudragada) సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan) ఓడిస్తానని కూడా శపధం చేశారు. అలా జరగకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పవన్ అత్యధిక మెజారిటీతో గెలవడం.. కూటమి అధికారంలోకి రావడంతో ముద్రగడ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యారు. పేరు ఎప్పుడు మార్చుకుంటారు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన పేరు మార్చుకుంటూ ఏపీ ప్రభుత్వంతో ప్రత్యేక ఉత్తర్వు కూడా ఇప్పించుకున్నారు. అడపాదడపా వెలుగులోకి వస్తున్నారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నారు. వైఫల్యాలను ఎండగడుతున్నారు.
* చంద్రబాబుకు లేఖ
తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు( Chandrababu) ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తోందని.. కేసులతో వైసిపి శ్రేణులను వేధిస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదు అంటూ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇది మీ అనుమతితో జరుగుతోందా? అని ప్రశ్నించారు కూడా. ఇది మీ మనస్తత్వం కానే కాదని.. రాజకీయ ప్రత్యర్థులను వేధించే గుణం మీది కాదు అంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. 1978లో వైయస్ రాజశేఖర్ రెడ్డి( ys Rajasekar Reddy) , చంద్రబాబు, ముద్రగడ పద్మనాభం తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ సమయంలో ముగ్గురు స్నేహంగా మెలిగారు. అదే విషయాన్ని ముద్రగడ గుర్తు చేశారు. అప్పట్లో ప్రత్యర్థులను వేధించేందుకు ఒప్పుకునే వారు కాదని.. ఇప్పుడెలా రెడ్ బుక్ కు అనుమతించారని ప్రశ్నించారు.
* అంతగా యాక్టివ్ లేరు
ముద్రగడ పద్మనాభం కుమార్తె ఇటీవల జనసేనలో( janasena) చేరారు. మరోవైపు జగన్ సైతం ముద్రగడను పెద్దగా పట్టించుకోవడం లేదు. వరదల సమయంలో పిఠాపురం వెళ్లిన జగన్ కనీసం ముద్రగడను గౌరవపూర్వకంగా కలవలేదు కూడా. అదే సమయంలో ముద్రగడ సైతం పెద్దగా యాక్టివ్ గా లేరు. తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో సైతం ఎప్పుడు కనిపించలేదు. వైసిపి కార్యకలాపాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. కానీ ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రం ఆలోచన చేస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. లేఖలు విడుదల చేస్తున్నారు. చంద్రబాబుపై విరుచుకుపడే ముద్రగడ ఆయనను మెచ్చుకుంటూ లేఖ రాయడం విశేషం. మొత్తానికైతే వైసీపీ నేతలు చంద్రబాబు హుందా గురించి మాట్లాడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రకరకాల చర్చకు కారణమవుతోంది.