Harassment by YCP : శాంతిభద్రతలపై ఢిల్లీలో పోరాటం.. వైసీపీ వేధింపులకు ఎంపీడీవో బలి.. జగన్ ఇప్పుడు ఏమంటారో?

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ మాజీ సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వ అరాచకాలను జాతీయస్థాయిలో ఎండగట్టాలని చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ ఎంపీడీవో ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. అయితే దీనికి వైసిపి నేతలే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో జగన్ ఇరకాటంలో పడ్డారు.

Written By: Dharma, Updated On : July 23, 2024 3:35 pm
Follow us on

Harassment by YCP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలకు క్షీణించాయని జగన్ ఆరోపిస్తున్నారు. వినుకొండలో వైసీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని.. ఏపీలో హత్య రాజకీయాలు పెచ్చు మీరుతున్నాయని ఆరోపిస్తూ జగన్ ఢిల్లీ వేదికగా ఆందోళన బాట పట్టారు. రేపు జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఎందుకు అసెంబ్లీ సమావేశాలను సైతం ఆయన బహిష్కరించారు. అయితే నరసాపురం ఎంపీడీవో ఆత్మహత్య వెలుగు చూసింది. గత కొద్ది రోజులుగా ఆయన ఆచూకీ లేకుండా పోయింది. ఈరోజు ఆయన మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఇది అధికార పక్షానికి ప్రచార అస్త్రంగా మారనుంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సముచిత కేటాయింపులు ఒకవైపు, వైసీపీ నేతల వేధింపులకు తాళలేక ఎంపీడీవో ఆత్మహత్య మరోవైపు.. కూటమి ప్రభుత్వానికి అనుకోని అస్త్రంగా మారాయి. జగన్ తీరుపై మూడు పార్టీలు ముప్పేట దాడి చేయనున్నాయి.

* విషాదాంతంగా అదృశ్యం
నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. విజయవాడలోని ఏలూరు కాలువలో ఆయన మృతదేహం లభ్యమయింది. ఈ నెల 15న ఆయన మధురానగర్ రైలు వంతెన పైనుంచి ఏలూరు కాల్వలో దూకారు. దీంతో గత వారం రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, పెనమలూరు పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు కాలువను జల్లెడ పట్టారు. మధురానగర్ వంతెన పిల్లర్ కు మృతదేహం చిక్కుకొని ఉండిపోయింది. దూకిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలోనే మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఇది సంచలనం గా మారింది. వైసీపీ నేతల వేధింపులతోనే ఎంపీడీవో రమణారావు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఇది రాజకీయ రంగు పులుముకోనుంది.

* రాజకీయ అంశంగా వినుకొండ హత్య ఘటన
వినుకొండలో యువకుడి దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే. మృతుడు వైసిపి నేత అని.. చంపింది టిడిపి వ్యక్తి అని ఆరోపిస్తూ వైసిపి జాతీయస్థాయి ఉద్యమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టడానికి జగన్ సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఇంతలోనే ఎంపీడీవో మృతదేహం వెలుగు చూడడం.. వైసీపీ నేతల వేధింపులతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో.. టిడిపి కూటమి పార్టీలు వైసిపి పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎవరిది హత్యా రాజకీయం? అంటూ ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఇది రాజకీయ అంశంగా మారనుంది. అధికార విపక్షం మధ్య విమర్శలకు కారణం కానుంది.

* వైసిపి నేత చర్యలతోనే
వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజు నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి అనుచరుల నుంచి ఎంపీడీవో రమణారావుకు వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రసాదరాజు అండదండలతోనే ఈ వేధింపులు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖను కుటుంబ సభ్యులకు పంపించడం గమనార్హం. దీంతో వైసిపి నేతల వేధింపులతోనే రమణారావు అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో గా పని చేస్తున్న వెంకటరమణారావు విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. జూలై మూడు నుంచి విధులకు సెలవు పెట్టిన ఆయన ఇంటికి వచ్చారు. ఈనెల 15న మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని.. ఇంటికి రావడానికి లేట్ అవుతుందని తెలిపాడు. అర్ధరాత్రి దాటాక ‘ నా పుట్టినరోజు అయిన 16వ తేదీనే నా చావు రోజు కూడా.. అందరూ జాగ్రత్త’ అని కుమారుడు ఫోన్ కు మెసేజ్ చేశారు. ఆ రోజు నుంచి వారం రోజులు గాలింపు చర్యలు చేపడితే ఈరోజు మృతదేహం లభ్యమయ్యింది. వైసిపి నేతల వేధింపులతోనే రమణారావు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

* అధికార పక్షానికి ప్రచారాస్త్రం
ఈ ఘటనకు సంబంధించి వైసీపీపై ఎదురుదాడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ జగన్ జాతీయస్థాయిలో ఉద్యమానికి సిద్ధమయ్యారు. కానీ వైసీపీ నేతల వేధింపులతోనే ఒక ఎంపీడీవో ఆత్మహత్యకు పాల్పడడంతో.. ఇప్పుడు జగన్ ఇరకాటంలో పడినట్టే. కచ్చితంగా దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకుంటుంది అధికారపక్షం. పైగా జగన్ శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగు చూడడం కూడా వైసీపీకి మైనస్ గా మారింది. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పైగా ఇటీవల శాంతి భద్రతల ఘటనలకు సంబంధించి జగన్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎంపీడీవో ఆత్మహత్యపై సైతం స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.